హనుమకొండలో మహిళా కాంగ్రెస్ భారీ ధర్నా
కేంద్ర మంత్రి తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
హనుమకొండ, వాయిస్ ఆఫ్ వందే భారత్ : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆదేశాల మేరకు ఆదివారం హనుమకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ కూడలి వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కుమారుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ భాజపా తీరుపై నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా ‘బేటీ బచావో – బేటీ పడావో’ అంటూ ప్రచారాలు చేసే బీజేపీ నాయకులు, తమ సొంత పార్టీ నాయకుల పిల్లలు అరాచకాలకు పాల్పడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. “బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగితే బాధిత బాలికకు న్యాయం జరగదు. అధికారం అండతో చట్టాన్ని చుట్టంలా మార్చుకోవాలని చూస్తున్నారు” అని ఆమె ఆరోపించారు. సాధారణ పౌరులపై పోక్సో కేసు నమోదైతే వెంటనే అరెస్టు చేసే పోలీసులు, కేంద్ర మంత్రి కుమారుడి విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సుమారు 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు లైంగిక వేధింపుల కేసుల్లో ఉన్నారని, వారికి ఆ పార్టీ రక్షణ కల్పిస్తోందని విమర్శించారు. అధికారం ఉన్నవారికి ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం ఉండకూడదని, చట్టం ఎవరికీ చుట్టం కాదని స్పష్టం చేశారు. బాధిత మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం చేసే స్థాయికి పరిస్థితి వెళ్లిందంటే దోషుల ఆగడాలు ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బండి సంజయ్‌ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్వర్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
