వాయిస్ ఆఫ్ వందే భారత్, వరంగల్ : సమాజంలోని అనాథలకు, దివ్యాంగులకు, మహిళా సాధికారతకు మూడు దశాబ్దాలుగా నిస్వార్థ సేవలు అందిస్తున్న అనురాగ్ సొసైటీ చైర్మన్, కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డికి ‘ఉత్తమ కాకతీయ మాతృమూర్తి’ అవార్డు దక్కింది. మదర్స్ డే-2026 పురస్కరించుకుని అంజలీ మీడియా గ్రూప్, అందరి టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాతృశక్తి మహోత్సవం’లో ఆమెను ఘనంగా సన్మానించారు. సంస్థ నిర్వాహకులు కామిశెట్టి రాజు పటేల్ మాట్లాడుతూ.. డాక్టర్ అనితా రెడ్డి గత 30 ఏళ్లుగా అనాథలకు అమ్మలా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. వృద్ధులు, అంధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం ఆమె చేస్తున్న కృషి వెలకట్టలేనిదని, అందుకే ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేయడమే కాకుండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. మహిళల్లో చైతన్యం తెస్తూ, వారి సాధికారత కోసం ఆమె చూపిస్తున్న నాయకత్వం ఎందరికో ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి ఇంతటి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురు మహిళామణులను కూడా సన్మానించారు. కార్యక్రమంలో విజయలక్ష్మి, సరళ, విష్ణు, సిరాజుద్దీన్, శ్రీమన్నారాయణ, లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.