అవగాహన సదస్సులో కలెక్టర్ సత్య శారద
సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు రేపు రాత్రి వరకు ఆఖరి గడువు
11 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం
అవగాహన సదస్సులో కలెక్టర్ సత్య శారద
వాయిస్ ఆఫ్ వందే భారత్, హనుమకొండ : దేశాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన ‘జనగణన-2027’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండలోని ఐఎంఏ హాల్‌లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియపై నిర్వహించిన అవగాహన సమావేశంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మిలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ విధానం అందుబాటులో ఉందని తెలిపారు. మే 10 (ఆదివారం) రాత్రి 12:00 గంటల వరకు మాత్రమే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశం ఉంది. మే 11 నుంచి ఎన్యుమరేటర్లు నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో ప్రజలు పూర్తి సమాచారంతో సహకరించాలని కోరారు. సంక్షేమ పథకాలు, వనరుల పంపిణీ, అభివృద్ధి పనుల ప్రణాళికలకు ఈ గణాంకాలు ప్రాతిపదికగా నిలుస్తాయని వివరించారు. కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. జనగణనలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవడం పౌర బాధ్యత అని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. జిల్లా జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ నిధుల కేటాయింపు జరుగుతుందని, అందుకే జనగణన ఎంతో ప్రాధాన్యత కలిగినదని తెలిపారు. అనంతరం ఐఎంఏ హాల్ నుంచి పోచమ్మ మైదానం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రామిరెడ్డి, సీపీఓ చంద్రకళ, వివిధ మండలాల తహసిల్దార్లు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.