అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

Ravi Goli

May 10, 2026

బయ్యారం కొనుగోలు కేంద్రంలో రైతుల ఆవేదన
20 రోజులుగా కాంటాలు పెట్టకపోవడమే శాపం
అధికారులపై ఆగ్రహం

బయ్యారం, వాయిస్ ఆఫ్ వందేభారత్ : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. మండలంలోని కొత్తపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన వడ్లు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. కళ్లముందే ధాన్యం నీటిపాలవ్వడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నా, ఇంతవరకు కాంటాలు (తూకం) వేయకపోవడం వల్లే తమకు ఈ నష్టం వాటిల్లిందని రైతులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. “సమయానికి ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం నుంచి గన్ని బ్యాగుల (గోనె సంచులు) సరఫరా సరిగ్గా లేకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణం” అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా, తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యం వల్ల కలిగే బరువు తగ్గుదల, నాణ్యత దెబ్బతినడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధర కల్పించాలి. కొనుగోలు కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట, చేతికొచ్చే సమయంలో నీటిపాలవ్వడంతో రైతులు కుమిలిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కొత్తపేట రైతులు వేడుకుంటున్నారు.

Leave a Comment