స్వయంభూ శ్వేతార్క గణేశుడి వైభవం/The glory of the self-existent, white-skinned Lord Ganesha
కాజీపేటలో దేవాలయం నిర్మాణం
ఎంతో విశిష్ఠత కలిగిన ఆలయం
అమృతశిల విగ్రహాల ప్రతిష్ఠాపన
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా, కాజీపేట రైల్వేస్టేషన్ ప్రాంగణంలో కొలువై ఉన్న ఈ పురాతన గణపతి దేవాలయం అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి గణేశుడు స్వయంగా శతాధిక సంవత్సరాలు దాటిన శ్వేతార్కం (తెల్ల జిల్లేడు) చెట్టు మూలం (వేరు) నుంచి గణపతి ఆకృతిని పొంది, తూర్పు ముఖంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. సంగీత స్వరాలు పలికే అమృతశిల విగ్రహాలు ఈ దేవాలయం ముఖ్య ప్రత్యేకత విగ్రహాల తయారీలో ఉంది. తమిళనాడులోని మహాబలిపురంలో లభించిన అమృతశిల అనే ప్రత్యేకమైన రాయితో ఇక్కడి విగ్రహాలను తయారుచేశారు. నాణెం లేదా ఏదైనా లోహపు వస్తువుతో ఈ విగ్రహాలను కొట్టినప్పుడు వాటి నుంచి మధురమైన సంగీత స్వరాలు పలుకుతాయి.
వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక కథనం :

పేరు వెనుక చరిత్ర (శ్లోకం నుంచి ఉద్భవం)..
‘శ్వేతార్కమూల గణపతి’ అనే పేరు వెనుక గొప్ప చరిత్ర ఉంది:
శ్వేతం: తెలుపు
ఆర్కము: జిల్లేడు
మూలము: వేరు
నారద పురాణం: తెల్ల జిల్లేడు చెట్టు వంద సంవత్సరాలు పెరిగితే, ఆ చెట్టు వేరు మూలంలో గణపతి రూపం తయారవుతుందని నారద పురాణంలో చెప్పబడింది.
స్వయంభూ రూపం: ఈ విగ్రహాన్ని చెక్కడం కానీ, మలచడం కానీ చేయలేదు. స్వయంగా భూమి నుంచి ఉద్భవించిన ఈ శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనం, తల్పం వంటివి స్పష్టంగా కనబడతాయి.
దేవాలయ నిర్మాణం – ప్రతిష్ఠాపన
ఈ దేవాలయాన్ని ఐనవోలు అనంత మల్లయ్యశర్మ 2009లో నిర్మించారు. కాణిపాకం గణపతి దర్శనం అనంతరం, 1999 ఏప్రిల్ 20న మల్లయ్యశర్మకు కలలో నల్గొండ పట్టణానికి చెందిన మాడ ప్రభాకర శర్మ ఇంటిలోని ‘శ్వేతార్కమూల గణపతి’ దర్శనమిచ్చారు. నల్గొండకు వెళ్లి తెల్లజిల్లేడు వేరులో ఉన్న ఈ గణేశుడి విగ్రహాన్ని కనుగొన్నారు. 2009లో విష్ణుపురిలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కనిపించేలా దేవాలయం నిర్మించి, ఐదుగురు పీఠాధిపతుల సమక్షంలో ప్రతిష్ఠాపన చేశారు. ఈ విగ్రహానికి పద్దెనిమిదిన్నర కిలోల వెండి కవచాన్ని అమర్చారు. దేవాలయం ఒడియా నిర్మాణ శైలిలో మూడు అంతస్తుల సముదాయంగా నిర్మించబడింది. ఈ సముదాయంలో వీరాంజనేయ, సీతారామలక్ష్మణులు, పద్మావతి వేంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పస్వామి, షిరిడీ సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయి.
నిత్య పూజలు:
ఉదయం 6:30 గం. – అభిషేకం
ఉదయం 8:00 గం. – మహానివేదన
రాత్రి 7:00 గం. – పూజలు
ప్రత్యేక పూజలు: ప్రతినెల మొదటి మంగళవారం రోజున ప్రత్యేక గణపతి హోమం, గరిక పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయానికి స్వంత వెబ్‌కాస్టింగ్ సౌకర్యం, రేడియో సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ప్రతిరోజూ దాదాపు 12,000 మంది భక్తులకు ఆన్లైన్లో ప్రసారం ద్వారా చేరవేయబడుతున్నాయి.
