సీఓఈ బాలుర తరలింపు యత్నాన్ని వ్యతిరేకిస్తాం/We will oppose the attempt to relocate the COE boys.
టీజీపీఏ రాష్ట్ర కమిటీ
వాయిస్ ఆఫ్ భారత్, జమ్మికుంట: 2006లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రగతిశీల గురుకుల విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యంతో మూడు COE (Centers of Excellence) విద్యా సంస్థలు స్థాపించింది. వాటిలో రెండు ఆంధ్ర ప్రాంతంలో (వైజాగ్, కడప) ఉండగా, ఉత్తర తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామంలో COE బాల, బాలికల గురుకులాలను ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఈ విద్యాలయం విద్యార్థులు NEET, EAMCET, IIT, NIT వంటి పోటీ పరీక్షల్లో గణనీయమైన ఫలితాలను సాధిస్తూ ఉన్నత స్థాయిలో ప్రదర్శన చూపుతున్నారు. అలుగునూర్ COE విద్యా సంస్థ విద్యా ప్రమాణాలు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో అలుగునూర్ COE లో చదువుతున్న బాలురను వేరే జనరల్ గురుకులాలకు తరలించే యత్నాన్ని టీజీపీఏ (తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్) తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు తారుమారయ్యేలా చేసే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్ కలెక్టర్కు టీజీపీఏ నేతలు వినతిపత్రం సమర్పించారు. గురువారం అలుగునూర్ COE ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి తో సమావేశమై, బాల, బాలికలు ఒకే క్యాంపస్లో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాలురను యథాతథంగా అదే క్యాంపస్లో కొనసాగించకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని టీజీపీఏ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసె పవన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ దార మధు, విజ్ధం ఫండ్ వింగ్ కన్వీనర్ కన్నూరి శ్రీశైలం, సిరిసిల్ల జిల్లా ఇంచార్జి నగునూరి చందు, పేరెంట్స్ కాశిపేట శ్రీకాంత్, సంపత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
