వైద్యులు సమయపాలన పాటించకుంటే చర్యలు
ఎమ్మెల్యే మురళి నాయక్
వాయిస్ ఆఫ్ భారత్, మహబూబాబాద్ : జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు సమయపాలన పాటించకపోవడంపై ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి సమయ పాలన పాటించని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో కిడ్నీ అనారోగ్య బాధితులకు 10 పడకల డయాలసిస్ సేవలు, మృత దేహాలను భద్రపరిచే 4 ఫ్రీజర్ బాక్సులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అనారోగ్య బాధితులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డయాలసిస్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్య సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. డయాలసిస్ సేవలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి రాజ నరసింహలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. డబ్బులు ఇచ్చి చేతులారా జబ్బులు కొని తెచ్చుకుంటున్నారని, ఆరోగ్యకరమైన అపరమిత ఆహారం తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ నడక, వ్యాయామంతో కిడ్నీ వ్యాధిని నివారించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారి మురళీధర్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ఆసుపత్రి సుపరిండెంట్ శ్రీనివాస్ నాయక్, వైద్య అధ్యాపకులు, వైద్యులు డాక్టర్ పాల్గొన్నారు.
