రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం
2026-27 సంవత్సరానికి సాగు పెట్టుబడి నిర్ణయం
హాజరైన వ్యవసాయ, బ్యాంకింగ్, అనుబంధ రంగాల అధికారులు
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : స్థానిక సుబేదారిలోని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్ టీసీ) సమావేశం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి బి.రవీందర్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) కోసం వివిధ పంటల సాగుకు అవసరమయ్యే రుణ పరిమితులను ప్రాథమికంగా నిర్ణయించారు.
రాష్ట్ర స్థాయి కమిటీకి సిఫార్సు..
జిల్లాలోని రైతులు సాగు చేసే వివిధ పంటలకు, ఉద్యానవన, పట్టుపురుగుల పెంపకం, మత్స్య సంపద మరియు పశుసంవర్ధక రంగాలకు అందించాల్సిన రుణ మొత్తాన్ని శాస్త్రీయంగా చర్చించి ఖరారు చేశారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం కోసం పంపనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా రైతులకు సకాలంలో అవసరమైన పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం/ఏజీఎం ఎల్. చంద్రశేఖర్, డీసీసీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి. వజిర్ సుల్తాన్, జీఎం ఉషశ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎం మధు పాల్గొన్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, మత్స్య శాఖ, పశువైద్య మరియు మార్కెటింగ్ శాఖల అధికారులు హాజరయ్యారు. బ్యాంకింగ్ రంగం నుండి ఎల్డీఎం, రీజినల్ బ్యాంక్ అధికారులు, పరిశోధన విభాగం నుంచి ఆర్ఏఆర్ఎస్, కేవీకే శాస్త్రవేత్తలు తమ సూచనలను అందించారు. ప్రగతిశీల రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొని సాగు ఖర్చులపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

