యూరియాపై అసత్య ప్రచారాలను నమ్మకండి

యూరియాపై అసత్య ప్రచారాలను నమ్మకండి

రంగినేని శ్రీనివాస్ రావు
రాజకీయ కక్షతోనే తప్పుడు వార్తలు..
ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడదాం

వాయిస్ ఆఫ్ వందే భారత్, లింగాల : మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు యూరియాను అక్రమంగా తరలించారంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం రాజకీయ కక్షతో చేస్తున్న తప్పుడు ప్రచారాలేనని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదంపై శనివారం మండల వ్యవసాయ అధికారి, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సమక్షంలో క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపించినట్లు ఆయన తెలిపారు. సదరు రైతు తన వ్యక్తిగత అవసరాల కోసం, తన పొలానికి వినియోగించుకోవడానికి మాత్రమే యూరియాను నిల్వ ఉంచుకున్నారని అధికారులు అధికారికంగా పంచనామా నిర్వహించి ధృవీకరించారని వెల్లడించారు. అధికారుల సమక్షంలో జరిగిన ఈ పంచనామా పత్రమే తమ నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాస్ రావు మండిపడ్డారు. ఓటమి భయంతో, ఉనికిని చాటుకోవడానికి బురదజల్లే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని, గ్రామస్తులు ఇలాంటి అబద్ధాలను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగానే ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, జిల్లా సెక్రెటరీ, రాయవరం మాజీ సర్పంచ్ మల్లయ్య, అప్పాయిపల్లి సర్పంచ్ విజయకృష్ణ, సురాపూర్ సర్పంచ్ శేఖర్, మండల పార్టీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య, శ్రీనివాసరావు, మూడవత్ దస్తగిరి, రామచందర్, గోవర్ధన్, సైదులు, నరేష్, కురువ శ్రీశైలం,ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *