మెదడు శస్త్రచికిత్సల్లో విప్లవం

మెదడు శస్త్రచికిత్సల్లో విప్లవం
A revolution in brain surgery

రోబోటిక్ నావిగేషన్‌తో ప్రాణాలు సురక్షితం
యశోద హాస్పిటల్స్ వైద్యుల అద్భుతం

వాయిస్ ఆఫ్ భారత్, వరంగల్/సికింద్రాబాద్ : మెదడు సంబంధిత వ్యాధులు, ట్యూమర్ల చికిత్సలో వైద్యరంగం సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న అధునాతన రోబోటిక్ మరియు నావిగేషన్ టెక్నాలజీతో క్లిష్టమైన సర్జరీలు కూడా ఇప్పుడు అత్యంత సురక్షితంగా మారుతున్నాయి. ఇటీవల వరంగల్‌కు చెందిన ఒక మహిళకు నిర్వహించిన అరుదైన శస్త్రచికిత్స వివరాలను డాక్టర్ కె.ఎస్.కిరణ్ వెల్లడించారు. వరంగల్ నుంచి వచ్చిన 50 ఏళ్ల మహిళా పేషెంట్ గత నెల రోజులుగా మెదడులో గడ్డ, టీబీ లక్షణాలతో బాధపడుతున్నారు. సాధారణ టీబీ మందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఆమెను యశోద హాస్పిటల్స్‌కు తరలించారు. డాక్టర్ కిరణ్ బృందం ‘రోబోటిక్ నావిగేషన్ అసిస్టెడ్ బయాప్సీ’ ద్వారా ఆ గడ్డను పరిశీలించగా, అది ప్రమాదకరమైన ‘డ్రగ్-రెసిస్టెంట్ టీబీ’గా తేలింది. రోబోటిక్ సర్జరీ వల్ల గడ్డను విజయవంతంగా తొలగించడమే కాకుండా, సర్జరీ జరిగిన మరుసటి రోజే ఆమెను డిశ్చార్జ్ చేయడం విశేషం. ఇది సర్జరీ సమయంలో మెదడులో ట్యూమర్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా చూపిస్తుంది. దీనివల్ల మెదడును పూర్తిగా తెరవాల్సిన అవసరం లేకుండా చాలా చిన్న గాటుతో ఆపరేషన్ చేయవచ్చు. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పేషెంట్ కాళ్లు, చేతుల నరాల కదలికలను కంప్యూటర్ సిస్టమ్స్ నిరంతరం గమనిస్తుంటాయి. ఒకవేళ నరాలపై ఒత్తిడి పెరిగితే వెంటనే డాక్టర్లను హెచ్చరిస్తుంది. దీనివల్ల పక్షవాతం వంటి ముప్పు తప్పుతుంది. చిన్న రంధ్రం ద్వారా ఎండోస్కోప్ ఉపయోగించి చేసే ఈ పద్ధతి వల్ల పేషెంట్ చాలా త్వరగా కోలుకుంటారు. ఇన్ఫెక్షన్ భయం ఉండదు. పాత పద్ధతుల్లో ఆపరేషన్ పూర్తయి మత్తు వదిలాక గానీ పేషెంట్ చేతులు, కాళ్లు పనిచేస్తున్నాయో లేదో తెలిసేది కాదు. కానీ యశోదలోని ఇంట్రా-ఆపరేటివ్ ఎంఆర్ఐ, రోబోటిక్ సిస్టమ్స్ వల్ల ఆపరేషన్ టేబుల్ మీదే ప్రతి కదలికను గమనిస్తూ అత్యంత సురక్షితంగా ట్యూమర్‌ను తొలగించే అవకాశం ఉంటుందని డాక్టర్ కిరణ్ వివరించారు. ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉండటం వల్ల ఖర్చు తగ్గుతుంది. పేషెంట్ వెంటనే తన పనులు తాను చేసుకోగలుగుతారు. నరాలకు నష్టం వాటిల్లే ప్రమాదం దాదాపు సున్నా. మెదడు సంబంధిత సమస్యలు ఉన్నవారు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, సరైన సమయంలో తీసుకునే నిర్ణయం ప్రాణాలను కాపాడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *