బీసీల సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టండి
- ముఖ్యమంత్రికి దాసు సురేష్ వినతి
- మంత్రి పొన్నంతో సమావేశం
వాయిస్ ఆఫ్ భారత్ (పొలిటికల్): దశాబ్ద కాలంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న బీసీ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి గతవారం నివేదికను సమర్పించామని అట్టి విషయాలపై బీసీ మంత్రి పొన్నంప్రభాకర్ తో సమావేశమయ్యామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ బుధవారం సెక్రటేరియట్ లోని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో సమగ్రంగా వివరించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కో ఆపరేటివ్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 19 శాతానికి తగ్గించి బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్లకు పాలకమండళ్లను నియమించకుండా బీసీ నాయకత్వాన్ని అడుగడుగునా అణచివేసిన వైనాన్ని వివరించామన్నారు. ప్రభుత్వం త్వరలో ప్రకటించబోయే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లేఖలో కోరినట్లు తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిగిన సమావేశంలో తెలంగాణలో బీసీల జనగణన, బీసీ డిక్లరేషన్ అమలు, బీసీల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలపై చర్చించామని దాసు సురేష్ మీడియాకు వివరించారు. అద్దె భవనాలలో కొనసాగుతున్న బీసీ గురుకులాలకు సొంత భవనాలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. విద్యపై బడ్జెట్ కేటాయింపులను కేసీఆర్ ప్రభుత్వం క్రమంగా తగ్గించడాన్ని సంఖ్యాపరంగా మంత్రికి వివరించారు. 2014-15 వార్షిక బడ్జెట్ లో 10.89 శాతం విద్య కోసం వెచ్చించగా 2022-23 నాటికి బడ్జెట్లో కేవలం 6.24 శాతం మాత్రమే వెచ్చించి ప్రైవేట్ యూనివర్సిటీలకు తెరతీసిందన్నారు. తద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్లను కోల్పోయి విద్యకు దూరమయ్యారన్నారు. కొత్తగా ప్రారంభమైన ప్రైవేట్ యూనివర్సిటీలలో బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్సును జారీ చెయాలని మంత్రిని దాసు సురేష్ కోరారు. బీసీ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని త్వరలోనే బీసీ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారని దాసు సురేష్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షులు దొంత ఆనందం, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు భండారి పద్మావతి, ప్రధాన కార్యదర్శి ప్యారసాని దుర్గేష్, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ బింగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
