బీసీ రిజర్వేషన్ల అనిశ్చితి/Uncertainty over BC reservations
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యంపై నీలినీడలు
మహారాష్ట్ర తీర్పు ప్రభావం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడం ఇప్పుడు తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో తెలంగాణలో ఇటీవల జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల భవితవ్యంపై ఈ తీర్పు తీవ్ర అనిశ్చితిని పెంచింది.
వాయిస్ ఆఫ్ భారత్, తెలంగాణ :
తెలంగాణలో ఉన్న రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి?
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం వరకు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు. ఈ 50 శాతం పరిమితి దాటినందునే మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర తీర్పును ఆధారంగా చేసుకుని తెలంగాణలో ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, ఇక్కడ కూడా రిజర్వేషన్ల పరిమితి దాటినందున ఇప్పటికే ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నిక చెల్లుబాటు కాకుండా పోయే ప్రమాదం ఉంది.
ఎన్నికైన ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏమిటి?
ఒకవేళ రాష్ట్ర హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై జోక్యం చేసుకుని, ఎన్నికల నిర్వహణ చెల్లదు అని తీర్పునిస్తే, అప్పటికే బాధ్యతలు స్వీకరించి, అధికారంలో ఉన్న వేలాది మంది స్థానిక ప్రజాప్రతినిధుల పదవులు రద్దవుతాయి. ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తక్షణమే పదవులను కోల్పోతారు. దీంతో ఎంతో ఖర్చే చేసి తమ పదవీ కొల్పోతే ఉన్నది పోయే.. ఉంచుకున్నది పాయే అన్న విధంగా వారి పరిస్థితి మారుతుంది. స్థానిక సంస్థల పాలన ఒక్కసారిగా స్తంభించిపోయి, గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతుంది. స్థానిక సంస్థల పాలకమండలి లేకుండా పోవడంతో రాష్ట్రంలో ఒక రకమైన పాలనాపరమైన సంక్షోభం ఏర్పడుతుంది.
ప్రభుత్వం ముందున్న సవాల్
బీసీ రిజర్వేషన్ల అంశంపై తాజా తీర్పు నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని న్యాయ నిపుణులతో సమీక్షించుకోవాలి. మహారాష్ట్ర తీర్పు తరహాలో తెలంగాణలోనూ కోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేకుండా ముందస్తుగా చట్టపరమైన పరిష్కారాన్ని కనుగొనాలి. బీసీల రాజకీయ రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించకుండా, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పరిష్కారం చూపడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా నిలవనుంది. మహారాష్ట్ర తీర్పు నేపథ్యంలో, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, కోర్టుల జోక్యం ఉంటుందో లేదోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
