ఫిరాయింపుల వేటుకు ‘స్పీకర్’ బ్రేక్
దానం, కడియంలకు బిగ్ రిలీఫ్
వారు పార్టీ మారినట్లు ఆధారాల్లేవు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తింపు
అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పు
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కొట్టివేశారు. వారిద్దరూ పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, వారు ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నట్లు స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు క్లీన్ చిట్ లభించినట్లయింది.
వాయిస్ ఆఫ్ వందే భారత్, హైదరాబాద్ –
స్పీకర్ ఎదుట జరిగిన విచారణలో దానం నాగేందర్, కడియం శ్రీహరిలు తాము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని వాంగ్మూలం ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. సాంకేతికంగా వారు పార్టీ మారినట్లు రుజువు కాలేదని పేర్కొంటూ బీఆర్ఎస్, బీజేపీ దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేశారు.
సుప్రీం విచారణకు ముందే కీలక నిర్ణయం
పార్టీ ఫిరాయింపుల అంశంపై రేపు (గురువారం) సుప్రీంకోర్టులో తుది విచారణ జరగనుంది. ఈ లోపే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని గతంలో న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో, నేడు వెలువడిన ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నైతికత నా ఒక్కడికేనా?: కడియం శ్రీహరి

స్పీకర్ తీర్పును స్వాగతించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని మంత్రులను చేసినప్పుడు నైతికత గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. “కేసీఆర్ తన హయాంలో చేసిన ఫిరాయింపులపై ప్రజలకు క్షమాపణ చెబితే, నేను ఇప్పుడే రాజీనామాకు సిద్ధం” అని సవాల్ విసిరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు: దానం నాగేందర్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయలేదని, ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పుకొచ్చారు. “నన్ను ప్రశ్నించే హక్కు కౌశిక్ రెడ్డికి ఎక్కడిది? కేసీఆర్ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది” అని పేర్కొన్నారు. ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినా తాను సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంపై దాడి..: కేటీఆర్ మండిపాటు

స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను అధికార పార్టీ తమకు అనుకూలంగా వాడుకుంటోందని, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని అభివర్ణించారు.
గాంధీ భవన్ లో సంసారం చేస్తూ క్లీన్ చిట్టా?: బండి సంజయ్

కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ.. శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా పార్టీ మారలేదని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని, న్యాయస్థానంలో తప్పక న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు సుప్రీంకోర్టులో జరిగే విచారణలో స్పీకర్ ఇచ్చిన ఈ క్లీన్ చిట్ పై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
