పాలకుర్తి అభివృద్ధి నా ధ్యేయం/ My goal is to develop Palakurti.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
వాయిస్ ఆఫ్ భారత్, పాలకుర్తి (సెప్టెంబర్ 09): పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆమె, మంగళవారం నిధుల కోసం రాష్ట్ర రాజధానిలో ఉన్నతాధికారులు, మంత్రులను కలిశారు. ఈ క్రమంలో ఆమె వేర్హౌస్ కార్పొరేషన్ ఎండీ కొర్ర లక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ దేవరుప్పుల మండలానికి 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆధునిక గోదాం అవసరం ఉందని వివరించారు. స్థానిక రైతులు పండించే ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు రక్షణ కల్పించడానికి ఈ గోదాం అత్యవసరమని తెలిపారు. ఎమ్మెల్యే విన్నపంపై సానుకూలంగా స్పందించిన ఎండీ కొర్ర లక్ష్మి, వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే గోదాం స్థాపన ప్రక్రియ ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు.
రైతులకు పెద్ద ఊరట..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ రైతులు పండించిన ధాన్యాన్ని నష్టం లేకుండా నిల్వ చేసుకోవడానికి గోదాంలు చాలా ముఖ్యమని అన్నారు. 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం ఏర్పాటైతే రైతులకు పెద్ద ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. పాలకుర్తి అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసమే ప్రతి అడుగు వేస్తున్నానని ఆమె అన్నారు. ఎమ్మెల్యే కృషిని అభినందిస్తూ, నియోజకవర్గ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
