తీన్మార్ మల్లన్నను కలిసిన గుడిసెవాసులు/ The hut dwellers who met Teenmar Mallanna
కబ్జాదారుడు మోతీలాల్ పై ఫిర్యాదు
ఇండ్ల కూల్చివేతతో సర్వం కోల్పోయామని ఆవేదన
న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విన్నపం
పేదలకు అండగా అధికారుల నిలవాలి
ఆదేశించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
వాయిస్ ఆఫ్ భారత్, గీసుగొండ (వరంగల్): గీసుగొండ మండలం పోగుల ఆగయ్య నగర్‌కు చెందిన గుడిసెల వాసులు తమ ఇళ్లను కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కోరారు. శుక్రవారం ప్రజాసంఘాల నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, పోత సునీత ఆధ్వర్యంలో బాధితులు హైదరాబాద్‌లోని క్యూ న్యూస్ కార్యాలయంలో మల్లన్నకు వినతిపత్రం సమర్పించారు. తాము గత 16 ఏళ్లుగా పోగుల ఆగయ్య నగర్‌లో నివాసం ఉంటున్నామని, రేకుల షెడ్లు, సిమెంట్ ఇటుకలతో ఇళ్లను నిర్మించుకున్నామని బాధితులు తెలిపారు. తమ ఇళ్లకు ఇంటి నెంబర్లు, కరెంటు బిల్లులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. భూ కబ్జాదారుడైన భూక్య మోతీలాల్ కోసం అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. ఈ చర్య వల్ల తమ నిత్యావసర వస్తువులు, దుస్తులు ధ్వంసమై లక్షలాది రూపాయల నష్టం జరిగిందని, సర్వం కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులు, కబ్జాదారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు ఎమ్మెల్సీని కోరారు. దీనిపై స్పందించిన తీన్మార్ మల్లన్న, మున్సిపల్, పోలీసు అధికారులకు ఫోన్ చేసి బాధితులకు అండగా నిలవాలని, వారికి న్యాయం చేయాలని సూచించారు. త్వరలో సంఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, పోత సునీత, మాదాసి సురేష్‌తో పాటు ఇళ్లు కోల్పోయిన గుడిసెల వాసులు పాల్గొన్నారు.
