చిన్న గల్లీలు… పెద్ద ప్రమాదాలు../Small alleys… big accidents..
ఇరుకైన గల్లీల్లో ఇరుకుపడిన భద్రత
పట్టణాల విస్తరణలోని మౌలిక లోపాలు
ప్రజల నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల వైఫల్యం
పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు
మార్పు కోసం సమష్టి చొరవ అవసరం
వేసవికాలం వచ్చిందంటే ఎక్కడో ఒకచోట అగ్నిప్రమాదం జరిగిన వార్తలు వినిపించకమానవు. గత నాలుగైదేళ్లను చూస్తే, అగ్నిప్రమాదాలు అన్నీ సాధారణ సంఘటనలుగా మారిపోయాయి. ప్రమాదం జరిగిన తర్వాతే సహాయక చర్యలు ప్రారంభమవుతున్నాయి తప్ప, ముందస్తు జాగ్రత్తలు చాలావరకు పట్టించుకోవడంలేదు. అయితే ఈ ప్రమాదాల మౌలిక కారణాలు మానవ తప్పిదాలేనన్నది గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం నేరుగా బాధ్యత వహించకపోయినా, ప్రమాదాలకు దారితీసే కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే.
వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి :
ప్రమాదాలకు నిబంధనల ఉల్లంఘనలు, మౌలిక లోపాలు, భద్రతా విధానాల వైఫల్యాలు ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా నగరాల్లో అధికంగా చెత్తాచెదారం నిల్వలు, పాత భవనాలు, గ్యాస్ పేలుళ్లు, ప్లాస్టిక్ సామాన్ల గోడౌన్లు వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ప్రజల నిర్లక్ష్యాన్ని సూచించే అంశం. ఇటీవలి హైదరాబాద్ గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదం — ఎనిమిది మంది చిన్నారులతో సహా పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు — ప్రజల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. ఇరుకైన మెట్ల మార్గాలు, సమర్థవంతంగా స్పందించలేని అగ్నిమాపక సిబ్బంది పరిస్థితులు, ఆకస్మిక అగ్నిప్రమాదాలకు దారితీస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రమాదాలకు కేంద్రాలుగా మారుతున్నాయి.

చిన్న పొరపాట్లతో పెద్ద ప్రమాదాలు..
ఈ ప్రమాదాల కారణాలు పరిశీలిస్తే, పాత తరం విద్యుత్ వైరింగ్, అధిక లోడుతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు, తాత్కాలిక మరమ్మతులు, గ్యాస్ లీకేజీలు, సరిగ్గా నిర్వహించని గ్యాస్ రెగ్యులేటర్లు, అజాగ్రత్తగా నిల్వ చేసిన రసాయనాలు, పెయింట్లు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి కనిపిస్తున్నాయి. ఇక వంట చేస్తూ శ్రద్ధలేకపోవడం, వదిలేసిన సిగరెట్లు, హీటింగ్ పరికరాల పనితీరుపై పర్యవేక్షణ లేకపోవడం వంటి ఘటనలు చిన్న చిన్న పొరపాట్లను పెద్ద ప్రమాదాలుగా మార్చేస్తున్నాయి.

నిబంధనలు బేఖాతరు..
పాతబస్తీ వంటి ప్రాంతాల్లో నివాస, వాణిజ్య భవనాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండటం, ఆక్రమణలతో కూడిన నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసిన అంతస్థులు, దొంగ కరెంటు వాడకాలు ఇవే ప్రమాదాలకు ప్రధాన మూలాలు. ఈ ప్రాంతాల్లో గల్లీలు ఇరుకుగా ఉండటంతో, అత్యవసర వాహనాలు కూడా సరైన సమయంలో సంఘటనా స్థలానికి చేరలేకపోతున్నాయి. ఈ వాస్తవం గుల్జార్ హౌజ్ ఘటనలో స్పష్టంగా బయటపడింది.
ప్రమాదాల నివారణకు చర్యలు అవసరం:
నియమిత అగ్ని భద్రతా ఆడిట్‌లు : వాణిజ్య, నివాస, పారిశ్రామిక మరియు ప్రభుత్వ భవనాలలో తప్పనిసరిగా నిర్వహించాలి.
చట్టబద్ధమైన బాధ్యతలు : భవన యజమానులు, నిర్వాహకులు తమ ప్రాంగణాల్లో అగ్ని భద్రత ప్రమాణాలను పాటించే బాధ్యత తీసుకోవాలి.
అవసరమయ్యే మార్పులు : పాత విద్యుత్ వ్యవస్థల బదులు కొత్త, భద్రమైన వాటిని ఏర్పాటు చేయాలి. ఎస్కేప్ మార్గాలు, అగ్నిమాపక పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
ప్రజల్లో అవగాహన పెంపు : ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో, ఎలా బయటపడాలో ప్రజలకు తెలియజేయాలి.
ఆక్రమణల తొలగింపు : పాతబస్తీ వంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి, వెంటనే చర్యలు తీసుకోవాలి.
ఇరుకైన వీధుల పునర్నిర్మాణం : అగ్నిమాపక వాహనాలు, రెస్క్యూ బృందాలు సులభంగా వెళ్లగల మార్గాలు ఉండేలా ప్లానింగ్ చేయాలి.

ఈ చర్యలు హైదరాబాద్‌తో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల పట్టణాల్లోనూ అమలవ్వాలి. ప్రజలలో అగ్నిప్రమాదాలపై అవగాహన పెంపు, తగిన భద్రతా ప్రమాణాల అమలు ద్వారా మాత్రమే ఈ ఘోర ఘటనలను తగ్గించగలుగుతాం. అవగాహన, జాగ్రత్త, క్రమశిక్షణ ఉంటేనే ప్రమాదాల ముప్పు తగ్గుతుంది.
