ఏప్రిల్ 1 నుంచి సలేశ్వరం జాతర

ఏప్రిల్ 1 నుంచి సలేశ్వరం జాతర

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం
ముగ్గురు అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ
గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్య బాధితులు రావద్దు
ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించాలని నిర్ణయం

వాయిస్ ఆఫ్ భారత్, నాగర్ కర్నూల్ : నల్లమల అడవుల్లో అత్యంత వైభవంగా జరిగే సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ జి.వి.శ్యాంప్రసాద్ లాల్, డీఎఫ్ఓ రేవంత్ చంద్రలతో కలిసి వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులను ఏప్రిల్ 1 నుంచి 3 వరకు మాత్రమే అనుమతిస్తారు. ఫారాహాబాద్ గేటు నుండి లోపలికి ప్రవేశం ఉంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపోల నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపాలని జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రాత్రి వేళల్లో నడిచే భక్తుల సౌకర్యార్థం మార్గమధ్యలో సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తారు. గుండం దగ్గర మరియు ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు వైద్య సిబ్బంది, అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సలేశ్వరం లోయ మార్గం అత్యంత కఠినంగా ఉంటుందని, కావున గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ జాతరకు రావద్దని కలెక్టర్, ఎస్పీ విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని వారు పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ:
అడవిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు ప్లాస్టిక్ రహితంగా భోజన సౌకర్యం కల్పించాలని సూచించారు. రాబోయే రెండు రోజుల్లో కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాసులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, ఆలయ కమిటీ సభ్యులు, చెంచు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *