ఏకవీర ఆలయాలు-వాటి చరిత్రలు
రెండు ప్రాంతాలు, రెండు కథలు
ఒకటి మహారాష్ట్రలో, మరొకటి తెలంగాణలో
కాకతీయుల వైభవం మొగిలిచెర్ల ఏకవీర దేవాలయం
పురాతన భారతదేశ చరిత్రకు ప్రతిబింబం
దక్షయజ్ఞం నుంచి శక్తిపీఠం వరకు
మహూర్ ఏకవీరికా దేవి కథ
మహూర్: పవిత్ర క్షేత్రాల సంగమం
భారతదేశంలో ఏకవీర దేవాలయం అనే పేరుతో రెండు పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మహారాష్ట్రలో, మరొకటి తెలంగాణలో ఉన్నాయి. ఈ రెండు దేవాలయాలకు వేర్వేరు చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి. ఈ రెండు వేటికి అవే ప్రత్యేకత కలిగి ఉన్న పురాతన దేవాలయాలు కాకతీయుల వైభవానికి ప్రతీకగా మొగిలిచెర్ల ఏకవీర దేవాలయం చరిత్రలో నిలిచి పురాత భారతదేశా చరిత్రకకు ప్రతిబింబంగా మారితే.. దక్షయజ్ఞం నుంచి శక్తిపీఠం వరకు మమూర్ ఏకవీరికా దేవి కథ దేదీప్యమానంగా వెలగుగోంతుంది. ఈ రెండు మహా క్షేత్రాలపై వాయిస్ ఆఫ్ భారత్ ప్రత్యేక కథనం..
వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి :
తెలంగాణలోని ఏకవీర దేవాలయం …
వరంగల్ జిల్లాలోని మొగిలిచెర్ల గ్రామంలో ఏక వీర ఆలయం ఉంది. ఇది కాకతీయ రాజుల కాలంలో క్రీ.శ. 1156 నుంచి 1196 మధ్య నిర్మించబడింది. రాణి రుద్రమదేవి వంటి కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని ఎంతగానో ఆదరించారని చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. ఆలయ విగ్రహం మాయమైంది, మిగిలిన విగ్రహాలు విరిగిపోయాయి. ఈ ఆలయం పక్కన ఉన్న చెరువు గట్టున మొగిలి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ గ్రామానికి మొగిలిచెర్ల అనే పేరు వచ్చింది.
ఈ ఆలయానికి కాకతీయ రాజులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా రాణి రుద్రమదేవి ఈ ఆలయాన్ని తరచూ దర్శించుకునేవారని స్థానికులు చెబుతారు. వరంగల్ జిల్లాలోని మొగిలిచెర్ల గ్రామంలో ఉన్న ఏకవీర దేవాలయం, కాకతీయుల కాలం నాటి విశిష్టమైన నిర్మాణంగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, తెలంగాణ చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలకు సాక్షిగా నిలిచిన ఒక చారిత్రక కేంద్రం.
ఆలయ నిర్మాణం- శిల్పకళ..
ఈ దేవాలయం గర్భగుడి, అంతరాళాలు, విశాలమైన రంగమంటపంతో కూడి ఉంది. తూర్పు, ఉత్తర దిశలలో కాకుండా పశ్చిమాభిముఖంగా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. రంగమంటపంలోని పైకప్పుపై అష్టదళ పద్మంతో కూడిన కప్పురాయి (కలైకడలి) చెక్కబడి ఉంది. ఆలయం ఇటుకలు 30 x 20 x 4 సెం.మీ. కొలతలతో కాకతీయుల కాలం నాటివిగా గుర్తించారు. గర్భగుడిలో శివలింగం, పానవట్టం, రెండు నాగశిల్పాలు కనిపించాయి. ఆలయ మూల విగ్రహం ఏకవీర దేవి విగ్రహం ఇప్పుడు లేదు. ఆ స్థానంలో, జటలు, త్రిశూలం, ఖడ్గం, ఢమరుకం, రక్తపాత్రలతో కూడిన అరుదైన భైరవ విగ్రహం ఆసనస్థితిలో పూజలందుకుంటోంది.
గ్రామ చరిత్ర.. శాసనాలు..
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఉన్న మొగిలిచెర్లను గతంలో ‘కేతకీతటాకపురం’ అని పిలిచేవారు. మొగిలి పొదలు అధికంగా ఉండటం వల్ల మొగిలిచెర్ల అనే పేరు వచ్చింది. పోచమ్మ గుడి దగ్గర 9వ శతాబ్దపు తెలుగు లిపిలో మొగిలిచెర్ల పేరు ప్రస్తావించబడింది.
చారిత్రక ప్రస్తావనలు..
కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వరచరితంలో కాకతీయ రుద్రదేవుడు మహాశక్తికి గుడి కట్టించినట్లు ఉంది. అలాగే, ఏకామ్రనాథుడు రచించిన ప్రతాపరుద్రచరిత్రములో రాణి రుద్రమదేవి ఈ ఆలయాన్ని పూజించారని, ఇక్కడే యుద్ధ వ్యూహాలను రచించేవారని పేర్కొనబడింది. మొగిలిచెర్ల ఒకప్పుడు జైన స్థానం అని చెప్పడానికి అక్కడ లభించిన ఆధారాలు సూచిస్తున్నాయి. ఏకవీర ఆలయం ముందు జైన కలశం చెక్కిన శిథిలమైన ద్వారపు శిల్పాలు కనుగొన్నారు. తొలుత జైనులైన కాకతీయులు తరువాత శైవులుగా మారారు. దీనివల్ల అనేక జైన దేవాలయాలు శైవాలయాలుగా మార్పు చెందాయి. మొగిలిచెర్ల ఆలయంలో లభించిన భైరవ శిల్పాలు, సప్తమాతృకల ఫలకాలు ఈ ప్రాంతంలో శైవ మతం ప్రాముఖ్యతను తెలుపుతాయి. మొగిలిచెర్ల గ్రామం ఒకప్పుడు కాకతీయల సైనిక శిక్షణ కేంద్రంగా ఉండేది. రుద్రమదేవి తన శత్రువులైన హరిహరదేవుడు, మురారిదేవులను ఇక్కడే ఓడించి బంధించారని చరిత్ర చెబుతోంది. గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద ఎనిమిది వీరగల్లులు (వీరుల స్మారక శిలలు) లభించాయి. ఇవి ఆ ప్రాంతం ఒకప్పటి యుద్ధభూమి అని సూచిస్తున్నాయి. ఈ వీరగల్లులలో కొన్నింటిపై శాసనాలు కూడా ఉన్నాయి, అవి గోవుల రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల కథలను వివరిస్తాయి. ఈ దేవాలయం కేవలం మతపరమైన కేంద్రం మాత్రమే కాకుండా, కాకతీయుల చరిత్ర, సైనిక వ్యూహాలు మరియు ఆ కాలం నాటి సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచి ఉంది.
మహారాష్ట్రలోని ఏకవీర ఆలయం..

ఈ ఆలయం లోనావాలా సమీపంలోని కర్లా గుహల పక్కన ఉంది. ఇది పాండవుల కాలం నాటిదిగా చెబుతారు. పురాణాల ప్రకారం, పాండవులు తమ వనవాస కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏకవీర దేవికి ఒకే రాత్రిలో ఆలయం నిర్మించి ఆమె ఆజ్ఞను నెరవేర్చినందుకు దేవి వారి భక్తికి మెచ్చి, వారిని గుహలలో దాచి రక్షించిందని నమ్ముతారు. ఈ ఆలయం కోలి, అగ్రి వంటి స్థానిక తెగలకు కులదైవంగా పూజలందుకుంటోంది.
ఏకవీరా దేవిని రేణుకాదేవి రూపంగా భావిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని కోలి, అగ్రి వంటి స్థానిక వర్గాలకు ఆమె కులదైవం. ఈ ఆలయం మూడు పశ్చిమ ముఖ దేవాలయాలతో ప్రారంభమైంది. నేడు మధ్య, దక్షిణ దేవాలయాలు మాత్రమే మంచి స్థితిలో ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే ఉన్న బౌద్ధ గుహలు పురాతన కాలంలో వివిధ మతాల మధ్య ఉన్న సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో మహూర్ అనే ప్రాంతంలో మరో పురాతన ఏకవీరికా దేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని అష్టాదశ శక్తిపీఠాలలో 8వ శక్తిపీఠంగా పరిగణిస్తారు. ఇక్కడి దేవిని ఏకవీరికా మాత అని పిలుస్తారు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తిపీఠాలుగా భావిస్తారు. ఇక్కడి పురాణాల ప్రకారం, సతీదేవి కుడి భుజం ఈ ప్రదేశంలో పడింది. ఈ ఆలయం పెన్ గంగా నది ఒడ్డున ఉంది. ఇది చాలా పురాతనమైనది, ఆలయం మొత్తం సింధూరం రంగులో ఉంటుంది. ఆలయంలో రేణుకా మాత విగ్రహం కేవలం శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖం మొత్తం సింధూరంతో నిండి ఉంటుంది.
పురాణ కథనం :
బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష ప్రజాపతికి అనేకమంది కుమార్తెలు ఉండేవారు, వారిలో సతీదేవి ఒకరు. సతీదేవి పరమశివుడిని వివాహం చేసుకుంది. ఒకసారి దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో శివుడు తప్ప అందరూ లేచి నిలబడి గౌరవం చూపించారు. శివుడి ఈ ప్రవర్తనను దక్షుడు అవమానంగా భావించాడు. దీనికి ప్రతీకారంగా, దక్షుడు మరో పెద్ద యజ్ఞం తలపెట్టి, తన కుమార్తె సతీదేవిని, అల్లుడు శివుడిని ఆహ్వానించలేదు. ఆహ్వానం అందకపోయినా, సతీ తన పుట్టింటిపై ప్రేమతో వెళ్లాలని అనుకుంది. శివుడు అడ్డుకున్నప్పటికీ, ఆమె ఆయన మాట వినకుండా యజ్ఞానికి హాజరైంది. యజ్ఞస్థలంలో తనను, తన భర్తను అందరూ అవమానించడం చూసి సతీదేవి తీవ్రంగా బాధపడింది. తన తండ్రి శివుడిని దుర్భాషలాడటం భరించలేక, ఆమె తన కుడి బొటనవేలితో భూమిపై గీసి అగ్నిని సృష్టించి ఆ యజ్ఞకుండంలో తనను తాను ఆహుతి చేసుకుంది. సతీదేవి ఆత్మాహుతి గురించి తెలుసుకున్న శివుడు, తీవ్ర ఆగ్రహంతో తన జడలోని ఒక భాగాన్ని భూమిపై కొట్టగా, దానినుండి భయంకరమైన వీరుడు వీరభద్రుడు జన్మించాడు. వీరభద్రుడు యజ్ఞస్థలానికి వెళ్లి దక్షుని తల నరికి సంహరించాడు. శివుడు తన ప్రియమైన సతీదేవి శరీరాన్ని భుజాలపై మోసుకుని భయంకరమైన తాండవ నృత్యం చేయడం ప్రారంభించాడు. ఆయన ఆగ్రహాన్ని అదుపు చేయడానికి, శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశాడు. ఈ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ పవిత్రమైన శక్తిపీఠాలుగా మారాయి. ఈ శక్తిపీఠాలు భారతదేశం, శ్రీలంక వంటి ప్రాంతాలలో 18 చోట్ల ఉన్నాయని చెబుతారు.
మహూర్‌లోని పవిత్ర స్థలాలు..
మహారాష్ట్రలోని మహూర్ పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఇక్కడ అనేక దేవాలయాలు మరియు పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఈ ప్రదేశం ప్రధానంగా రేణుకాదేవి, పరశురాముడు, దత్తాత్రేయ స్వామితో ముడిపడి ఉంది.
రేణుకాదేవి ఆలయం..
మహూర్‌లోని ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. రేణుకాదేవిని శక్తిపీఠంగా పూజిస్తారు. ఇక్కడి స్థానికుల కథనం ప్రకారం, రేణుకాదేవి ఆలయం ఏకవీరికా దేవి ఆలయం కంటే పురాతనమైనది, ఎక్కువ మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శనమిస్తుంది. రేణుకామాత పరశురాముడి తల్లి. ఆమె భర్త జమదగ్ని మహర్షి ఆలయంలో శివలింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా తమలపాకులు, వక్కలతో తయారు చేసిన పేస్ట్‌ను ప్రసాదంగా అమ్మవారికి అర్పిస్తారు.
పరశురాముడు, ఇతర దేవాలయాలు..
రేణుకాదేవి ఆలయం ఉన్న కొండపైనే విష్ణువు అవతారమైన పరశురాముడి ఆలయం కూడా ఉంది. పక్కనే పరశురామ కుండ్ అనే పవిత్రమైన చెరువు ఉంది. జగద్గురు దత్తాత్రేయ స్వామి ఆలయం మరొక కొండపై ఉంది. ఆయన తల్లి అనసూయ మాత, తండ్రి అత్రి మహర్షి ఆలయాలు కూడా పక్కనే ఉన్నాయి. ఇది గురు చరిత్రలో ప్రస్తావించబడిన పవిత్ర చెరువు. పరశురాముడు ఈ ప్రదేశంలో తన తండ్రికి కర్మలు నిర్వహించాడు. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఇది దత్తాత్రేయ స్వామి శయనించే ప్రదేశం. దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు వారణాసిలో గంగాస్నానం చేసి, కొల్హాపూర్‌లో భిక్ష స్వీకరించి, రాత్రిపూట మహూర్లో నిద్రిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం మహూర్ పట్టణంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రాలు మహూర్ను ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా మార్చాయి.

