ఈ ఎంపీ.. మాకొద్దు

ఈ ఎంపీ.. మాకొద్దు
  • సొంత పార్టీలోనే వ్యతిరేకత
  • వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరిపై తిరుగుబాటు
  • టికెట్ ఇచ్చినా సహకరించమంటున్న బీఆర్ ఎస్ నేతలు
  • కేటీఆర్ సమక్షంలోనే నిరసన గళం

రెండు పర్యాయాలు వరంగల్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నిక కావడంతోపాటు రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు నెలకొల్పిన పసునూరి దయాకర్ కు సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సాక్షిగా ఈ ఎంపీ మాకొద్దు అంటూ ముక్త కంఠంతో వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మూడోసారి మొండి చెయ్యే అన్న సంకేతాలు వస్తున్న తరుణంలో సొంత పార్టీ క్యాడర్ సైతం ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంపై పలు విధాలుగా చెప్పుకొంటున్నారు. ఆయనకు అదృష్టం కలిసి వచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించినా సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడూ ప్రజలకోసం పనిచేసింది లేదంటున్నారు. 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలతోపాటు సొంత పార్టీకి చెందిన నేతలు సైతం పసునూరిని వ్యతిరేకించడంతో మార్పు అనివార్యంగా భావిస్తున్నారు.
– వాయిస్ ఆఫ్ భారత్, స్పెషల్ స్టోరీ

వరంగల్ జిల్లా సంగెం మండలంలోని బొల్లికుంట గ్రామంలో పసునూరి కమలమ్మ-ప్రకాశం దంపతులకు 1967 ఆగస్టు 2 న జన్మించిన పసునూరి దయాకర్ కు అదృష్టం కలిసొచ్చింది. రెండు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో అడుగు పెట్టారు. టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి 2014 లో వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయనను డిప్యూటీ సీఎం చేయడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయగా 2015లో ఉపఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎల్ తరుపున పసునూరి దయాకర్ ను బరిలోకి దింపారు. అందరూ అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ పార్టీనే లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే భారీ మేజారిటీతో పసునూరి విజయం సాధించి రికార్డు సృష్టించారు. పసునూనికి 6,15,403 ఓట్లూ రాగ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1,56,315 ఓట్లు, బీజేపీ అభ్యర్థి డాక్టర్ పగిడిపాటి దేవయ్యకు 1,30,178 ఓట్లూ వచ్చాయి. దీంతో కాగా పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ మేజారిటీతో విజయం సాధించారు. దయాకర్ పేరున నెలకొల్పిన రికార్డు దరిదాపుల్లోకి కూడా రాష్ట్రం నుంచి మరెవరూ రాకపోవడం గమనార్హం. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ రెండో సారి విజయం సాధించారు. అయితే బీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్ దయతోనే తనకు ఈ గుర్తింపు లభించిందని దయాకర్ పలుమార్లు ప్రకటించుకున్నారు.

అభిప్రాయ సేకరణ..
రెండు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించిన పసునూరి దయాకర్ పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అధ్యక్షతన ఇటీవల హైదరాబాద్ లో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాలకు చెందిన సుమారు రెండు వేల మంది ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సుమారు ఐదు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులనుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు.

సొంత పార్టీలోనే వ్యతిరేకత..
త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ ఎస్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ముక్త కంఠంతో పసునూరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. తిరిగి పార్లమెంట్ సీటు పసునూరికి ఇస్తే ఎలా ఉంటుందంటూ కేటీఆర్ అడుగగానే సభా ప్రాంగణంలోని సభ్యులంతా ఒక్క సారిగా వ్యతిరేకించారు. ఆయనకు టికెట్ కేటాయిస్తే ఓడి పోవడం ఖాయమంటూ ఖరాఖండిగా చెప్పారు. కాదని టికెట్ ఇస్తే ఆయనకు సహకరించేది లేదంటూ తేల్చి చెప్పారు.

ప్రజలతోనూ అంతంతే..
ప్రజలనుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతకు పసునూరి దయాకర్ వ్యవహార శైలే కారణమంటున్నారు. రాకరాక వచ్చిన అవకాశాన్ని పసునూరి దయాకర్ సద్వినియోగం చేసుకోలేదన్న విమర్శలున్నాయి. సుమారు తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన లోక్ సభ సభ్యుడిగా కొనసాగినా ఇటు నాయకులతో కాని, అటు ప్రజలతో కాని సత్సంబందాలు కలిగి లేడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ప్రతి ఏడు వచ్చే నిధులతోనైనా ఏమైనా పనులు చేయించారా అంటే అదీ కూడా లేదంటూ పలువురు వాపోతున్నారు. ఆయనను ఒక రాజకీయ నాయకుడిగానే గుర్తించలేమంటున్నారు. ఆయన సొంత పనులు చేసుకోవడంలోనే తల మునకలయ్యారని పలువరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఆయనకు మరో మారు టికెట్ ఇస్తే గంగపాలు అయినట్లేనంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *