ఆమె వస్తే పార్టీకి నష్టమే
- క్యాడర్ లేని లీడర్.. మనకొద్దు
- సుధారాణిపై కాంగ్రెస్ నేతల తిరుగుబాటు
- ఆమె వస్తే పార్టీకి నష్టమే
- పదవి కాపాడుకునేందుకే ఎత్తుగడలు
- ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న పార్టీ శ్రేణులు
- జిల్లా మంత్రికి తెలుపకుండా చేర్చుకునేది లేదంటున్న అధిష్ఠానం
క్యాడర్ లేని లీడర్ గుండు సుధారాణి మనకొద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఆమె పదవులకోసం పాకులాడుతారు తప్ప పార్టీకి కానీ, ప్రజలకు కాని ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. కరెప్షన్ లోనూ అమె అందెవేసిన చేయి అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి నేతను కాంగ్రెస్ లో చేర్చుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం కొంతమంది కాంగ్రెస్ నేతలు జిల్లా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ దృష్టికి తీసుకుపోగా వారు సైతం సుధారాణి అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లా మంత్రికి తెలియకుండా, వారి అనుమతి లేకుండా పార్టీలో ఎవరినీ చేర్చుకునేది లేదంటూ అధిష్ఠానం సైతం స్పష్టం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా గుండు సుధారాణి పాత టీడీపీ నేతలతో పైరవీలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
– వాయిస్ ఆఫ్ భారత్, స్పెషల్ స్టోరీ
వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు గత కొద్ది రోజులుగా వైరల్ గా మారాయి. గత తెలుగు దేశం పార్టీ నేతలతో కలిసి ఆమె పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు సఫలమైనట్లు, ఈ నెల 20న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉండగా ఆమెను పార్టీలో చేర్చుకోవడాన్ని ఆ పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. పచ్చగా ఉన్న ప్రాంతంలోనే పది పైసలు సంపాదించుకోవచ్చన్న లక్ష్యంతోనే ఆమె పార్టీ మార్పును తెరపైకి తెచ్చినట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. క్యాడర్ లేని కరెప్షన్ మేయర్ ను పార్టీలోకి చేర్చుకుంటే చెడ్డ పేరు వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. ఆమెను చేర్చుకోవడం ద్వారా ఆమె లాభపడుతుంది తప్ప ప్రజలకు కాని, పార్టీకి కాని ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు.
మూసుకున్న ద్వారాలు..
గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సైతం ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ విషయంలో సీఎం అంతరంగికుడు వేం నరేందర్ రెడ్డి పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు..ఇతర పార్టీలనుంచి వచ్చిన వారిని చేర్చుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఇదే విషయాన్ని వేం నరేందర్ రెడ్డి సైతం దృవీకరించినట్లు తెలుస్తోంది. దీంతో సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ద్వారాలు మూసుకున్నట్లు తెలియవచ్చింది. అయినప్పటికీ టీడీపీ నేతలతో సుధారాణికి ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆమె పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
పదవికోసం ఎత్తుగడలు..
ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు గుండు సుధారాణికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారి పదవులు అనుభవించడం కొత్తేమీ కాదంటూ కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. మేయర్ పదవిని కాపాడుకునేందుకే రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఆ పార్టీలో రాజ్యసభ సభ్యురాలిగా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా పదవులను వెలగబెట్టారంటున్నారు. టీడీపీకి తెలంగాణలో కాలం చెల్లిందని గ్రహించిన సుధారాణి తెలివిగా ఉద్యమ పార్టీ అయిన టీఆర్ ఎస్ లో చేరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా, మహిళా ఆర్థిక సహకార సంఘం రాష్ట్ర చైర్మన్ గా పదవులు పొందారంటున్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆమె నగర ప్రజలకు చేసిందేమీ లేదంటున్నారు. తన స్వప్రయోజనాలు తప్ప సుధారాణి వేరే ఆలోచనే ఉండదంటూ విమర్శిస్తున్నారు.
టీడీపీ నేతలతో మంతనాలు..
రాష్ట్రంలో బీఆర్ ఎస్ శకం ముగిసిందని భావిస్తున్న గుండు సుధారాణి ఆ పార్టీకి రాం..రాం పాడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తనకు టచ్ లో ఉన్న పూర్వ టీడీపీ నేతలకు ఫోన్ చేయడంతో పాటు వారిని నేరుగా కలుసుకొని తనకు సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వ్యక్తే కావడంతో తన ప్రయత్నం సాఫీగా జరుగుతుందని సుధారాణి భావిస్తున్నట్లు తెలిసింది.
వ్యతిరేకిస్తున్న కొండా మురళి..
మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ వస్తున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితిలో ఆమెను పార్టీలోకి చేర్చుకునేది లేదంటూ ఖరాఖండిగా చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసిన వారికే పార్టీలో పెద్ద పీట వేస్తామన్నారు. పదవుల కోసం పాకులాడే వారిని కాంగ్రెస్ లోకి చేర్చుకోబోమన్నారు. జిల్లా మంత్రికి తెలుపకుండా, వారి ఆమోదం లేకుండా కొత్త వారిని ఎవరినీ కూడా పార్టీలో చేర్చుకునేది లేదంటున్న అధిష్ఠానం స్పష్టం చేసినట్లు చెప్పుకొంటున్నారు. ఇప్పుడు బీఆర్ ఎస్ లో సుధారాణి మాటను నమ్మేవారు లేరని, పార్టీ పెద్దలు సైతం ఆమె వ్యవహార శైలిని ఎండగడుతున్నట్లు సమారాచం. దీంతో సుధారాణి రెండుకు చెడ్డ రేవడిగా మారిందన్న ప్రచారం సాగుతోంది.
