ఆకట్టుకున్న జిల్లా స్థాయి టీఎల్ఎం మేళా/Impressive district level TLM Mela
రాష్ట్రస్థాయికి ఆరు టీఎల్ఎంల ఎంపిక
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస అనుభవాలను మెరుగుపరిచే లక్ష్యంతో హనుమకొండ జిల్లా విద్యాశాఖ ‘మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన’ పేరుతో జిల్లా స్థాయి టీఎల్ఎం (బోధనోపకరణాలు) మేళాను ఘనంగా నిర్వహించింది. హనుమకొండ ప్రభుత్వ బాలికల పాఠశాల, లష్కర్ బజార్లో ఏర్పాటు చేసిన ఈ మేళాను జిల్లా విద్యాశాఖ అధికారిణి డి. వాసంతి ప్రారంభించారు. ఈ మేళాలో 14 మండలాల నుంచి వచ్చిన 140 మంది ఉపాధ్యాయులు తాము స్వయంగా తయారు చేసిన సులభతరమైన, ఆకర్షణీయమైన, సృజనాత్మక బోధనోపకరణాలను ప్రదర్శించారు. అందుబాటులో ఉన్న అట్టముక్కలు, చార్టులు, దినపత్రికలు, వేస్ట్ మెటీరియల్, థర్మోకోల్ షీట్లతో తక్కువ ఖర్చుతో ఈ టీఎల్ఎంలను తయారు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ డి. వాసంతి మాట్లాడుతూ తరగతి గదిలో విద్యాబోధనకు టీఎల్ఎం అత్యంత అవసరమన్నారు. రెడీమేడ్‌గా కాకుండా ఉపాధ్యాయులు సొంతంగా తయారుచేసిన టీఎల్ఎంలను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అన్నారు. మండల స్థాయి నుంచి వచ్చిన టీఎల్ఎంలు చాలా నాణ్యతతో ఉన్నాయని ప్రశంసించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన టీఎల్ఎంలకు మరింత సృజనాత్మకత జోడించి ప్రదర్శించాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. ఈ మేళా నుంచి మొత్తం ఆరు టీఎల్ఎంలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. వాటిలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో మూడు, గణితంలో రెండు, ఈవీఎస్‌లో ఒకటి ఉన్నాయి.
ఎంపికైన టీఎల్ఎంలు, ఉపాధ్యాయుల వివరాలు:
తెలుగు (బహుళకృత్యం): కె. రమాదేవి, ఎంపీపీఎస్, పాలకుర్తి, దామెర
ఇంగ్లీష్ (మల్టీపర్పస్ గ్రిడ్): వి. శ్యాంసుందర్, ఎంపీయూపీఎస్, తక్కల్లపాడు, దామెర
ఇంగ్లీష్ (మై ఇంగ్లీష్ వరల్డ్): బి. కవిత, ఎంపీయూపీఎస్, మునిపల్లి, హసన్‌పర్తి
గణితం (జాయ్ ఫుల్ మ్యాథ్స్): కె. కవిత, ఎంపీయూపీఎస్, పులిగిల్ల, నడికూడ
గణితం (మ్యాథ్స్ విత్ బాంబు స్టిక్): టి. అశోక్, ఎంపీపీఎస్, వరికోల్, నడికూడ
ఈవీఎస్ (పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎయిర్ ప్రెషర్): పి. చంద్రయ్య, ఎంపీపీఎస్, కోతుల నడుమ, ఎలుకతుర్తి
ఈ కార్యక్రమంలో గుణాత్మక విద్య కోఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్, ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, సిఏంవో బద్దం సుదర్శన్ రెడ్డి, హనుమకొండ ఎంఈఓ జి. నెహ్రూ నాయక్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస స్వామి, న్యాయ నిర్ణేతల కమిటీ సభ్యులు వేణు ఆనంద్, మధుసూదన్ రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులు మరియు 140 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చివరగా, డీఈఓ వాసంతి పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

