Yamuna River/యమునా నది శుద్ధికి అడుగులు
యమునా నదిలో కాలుష్య సమస్య
16న ప్రారంభమైన నది శుద్ధి కార్యక్రమం
బీజేపీ హామీ అమలుకు శ్రీకారం
ఢిల్లీ ప్రాంతంలో నదికి కలుషిత జలాల సమస్య
కొత్త సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు
ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు
మన దేశంలో నదులను దేవతలుగా భావించి కొలుస్తాం. అయితే, ఆ సెంటిమెంట్లు ఉన్నప్పటికీ నదులు మురికి కూపాలుగా మారుతున్నాయి. యూరప్, అమెరికా వంటి పశ్చిమ దేశాల్లో నదులను అత్యంత శుభ్రంగా ఉంచుతున్నారు. అక్కడి విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరిస్తూ, మన నదులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నదీ జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు ప్రతీ అడుగునా నదిని పవిత్రంగా భావిస్తే, కలుషితం చేయకూడదనే భావన ప్రతి ఒక్కరిలో వస్తుంది.
వాయిఫ్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి :
యమునా నది కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. చఠ్ పూజ, మౌని అమావాస్య వంటి పర్వదినాల్లో నదీ స్నానం చేసే ఉత్తరాది ప్రజలకు, యమునా నది ఇప్పుడు మురికి కాలువగా మారిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ అంశాన్ని ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యమునా నది శుద్ధి పనులు చేపడతామని బీజేపీ హామీ ఇచ్చింది. ఫిబ్రవరి 16న యమునా నది శుద్ధి పనులు ప్రారంభమయ్యాయి.
కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారిన యమునా నది శుద్ధి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకంటే ముందే ప్రారంభమైంది. 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీని ఐదేళ్లలో అమలు చేయలేకపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి 20న కొత్త ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీలో మురుగుతో కలుషితం..
యమునా నది ఉత్తరాఖండ్లో హిమాలయాలను విడిచిన తర్వాత హర్యానా, యూపీ సరిహద్దుల వద్ద ప్రవహించి ఢిల్లీ నగరానికి చేరుతుంది. ఢిల్లీకి చేరుకునే వరకు పెద్దగా కలుషితం కాకుండా ఉన్న ఈ నది, నగరంలో ప్రవేశించిన తర్వాత మురుగుతో నిండిపోతుంది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్లో 3 కోట్లకు పైగా జనాభా ఉండటం, మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవడం ప్రధాన కారణం.
నాలుగు దశల ప్రణాళిక అమలు ..
ప్రస్తుతం ప్రభుత్వం ఢిల్లీ నగరానికి పరిమితమైన 57 కి.మీ మేర నదిని శుద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నాలుగు దశల ప్రణాళిక అమలు చేయబడుతోంది. ఇప్పటికే నదిలో పేరుకుపోయిన చెత్త తొలగించడం ఒక భాగం కాగా, ఇక నుంచి మురుగు నీరు నదిలో చేరకుండా నిరోధించడం మరో కీలక చర్య. ఫిబ్రవరి 16న క్లీనింగ్ ఆపరేషన్ ప్రారంభమై, ట్రాష్ స్కిమ్మర్లు, వీడ్ హార్వెస్టర్లు, డ్రెడ్జింగ్ యంత్రాలతో చెత్త తొలగించడం జరుగుతోంది.
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు..
నగరాల్లో మురుగు నీరు నేరుగా నదిలో కలవకుండా శుద్ధి చేసి వదలాలి. ఇందుకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీలు) అవసరం. ఢిల్లీకి ఇప్పటికే ఉన్న ఎస్టీపీలు సరిపోకపోవడంతో, ఇంకా 6 కొత్త ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదనపు ప్రధాన కార్యదర్శి నవీన్ చౌదరి ప్రకారం, ఈ ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరుగుతోంది.
