WINE SHOP COLESED/మూడు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్
25 నుంచి 27 వరకు మూసివేత
వాయిస్ ఆఫ్ భారత్ , తెలంగాణ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేసింది, అభ్యర్థులు ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా మద్యం షాపుల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగర శివారుల్లో కూడా మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ఒక పట్టభద్రుల నియోజకవర్గం ఉన్నాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే ప్రాంతంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు గ్రామాల్లో మద్యం షాపులను మూసివేయనున్నారు. యాదాద్రి జిల్లాలో కూడా ఇదే నిబంధనలు అమల్లో ఉంటాయి. మద్యం షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
