water dead storage/అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఆందోళనలో రైతులు
వాయిస్ ఆఫ్ భారత్, పెద్దపల్లి : భూగర్భ జలాల మట్టం రోజురోజుకూ తగ్గిపోతున్నది. దీని ప్రభావంగా బోర్లు ఎత్తిపోతుండగా, బావుల్లో నీరు పూర్తిగా అడుగంటిపోతున్నది. ఈ పరిస్థితి రైతులకు సాగు కష్టాలను తెచ్చిపెట్టడంతో పాటు ఆర్థికంగా తీవ్ర నష్టాలు కలిగిస్తోంది. ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నీటి లేమితో వరిస్తున్నాయి. దీంతో బోర్లు, బావులు నీరులేక వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతులు కొత్తగా బోర్లు వేయడం, బావులను పూడికతీయడం వంటి పనుల్లో నిమగ్నమై తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు.తెలంగాణ సాగునీటి సమస్యలపై మూడుదశాబ్దాల క్రితం కవి మల్లావజ్జల సదాశివుడు వ్యథను వ్యక్తం చేశారు. కానీ నేటికీ పరిస్థితిలో మార్పు రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూగర్భ జలాల సమస్యను పట్టించుకోకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టడం రైతాంగానికి మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతోందని వారు ఆరోపిస్తున్నారు.
భూగర్భ జలాల పరిస్థితి:
- 2023 ఫిబ్రవరి: 5.47 మీటర్ల లోతు
- 2024 ఫిబ్రవరి: 5.09 మీటర్ల లోతు
- 2025 ఫిబ్రవరి: 5.44 మీటర్ల లోతు
రైతుల ప్రకారం, గతంలో బీఆర్ఎస్ పాలనలో సాగునీరు కాలువల ద్వారా అందుబాటులో ఉండేదని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో భూగర్భజలాలు మరింత దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో సాగునీరు లభించడంలేదని, భవిష్యత్తులో తమ జీవనం ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
