TURMARIC SALES/పసుపు కొనుగోలుపై రైతుల ఆందోళన

TURMARIC SALES/పసుపు కొనుగోలుపై రైతుల ఆందోళన
##@@TURMARIC SALES#####

నిజామాబాద్‌ మార్కెట్‌లో రెండు రోజులుగా నిరసనలు

వాయిస్ ఆఫ్ భారత్ : నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో పసుపు అమ్మకాలకు భారీగా వస్తోంది. 50 వేల బస్తాలకు పైగా మార్కెట్‌కు రావడంతో యార్డ్‌ సందడిగా మారింది. అయితే, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ, మార్కెట్‌ యార్డ్‌ను ముట్టడించి, బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ ఎదుట రెండు గంటలపాటు ధర్నా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, నిన్న (ఆదివారం) పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో వ్యాపారులు, రైతుల మధ్య చర్చలు జరిగాయి. వ్యాపారులు క్వింటాలుకు రూ.500 తగ్గించి కొనుగోలు చేయడానికి సిద్ధమని స్పష్టం చేయడంతో, చేసేదిలేక రైతులు ఒప్పుకున్నారు. దీంతో, ప్రస్తుతం క్వింటాల్‌ పసుపును రూ.9,500కి కొనుగోలు చేస్తున్నారు. రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, గతేడాది క్వింటాల్‌ ధర రూ.18,000 ఉండగా, ఈ సంవత్సరం రూ.10,000 లోపే పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత కారణంగా ధరలు పడిపోతున్నాయని మార్కెట్‌ అధికారులు చెబుతుండటంపై రైతులు మండిపడ్డారు. వ్యాపారులు, మార్కెట్‌ కమిటీ కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

రైతుల నిరసనలు కొనసాగుతూ…
సోమవారం నిజామాబాద్‌ ప్రధాన బస్టాండ్‌ వద్ద పసుపు రైతులు మెరుపు ధర్నా నిర్వహించారు. మంగళవారం కూడా నిరసన కొనసాగిస్తూ, ప్రభుత్వం మోసం చేసిందని, పసుపు బోర్డు పెట్టినా లాభం లేకుండా పోయిందని మండిపడ్డారు. కలెక్టర్‌ వచ్చి సమాధానం చెప్పే వరకు ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు. రైతులు వ్యాపారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, మార్కెట్‌ యార్డ్‌ పూర్తిగా వ్యాపారుల చేతిలోనే ఉందని విమర్శించారు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి, కావాలని ధరలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. మార్కెట్లో ఉన్న వందల కుప్పల పసుపులో, కేవలం కొన్ని మాత్రమే పరిశీలించి నాణ్యత లేదని చెప్పి కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు అమ్మకానికి తీసుకొచ్చిన రైతులు కనీసం వారం రోజులుగా ఎదురు చూస్తున్నా, కొనుగోలు జరగక పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వ్యాపారులు చెప్పిన రేటుకు పసుపు అమ్మకానికి మినహా మరో మార్గం లేకపోవడంతో కన్నీటి మధ్య వెనుదిరుగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *