SLBC ACCIDENT/ఎల్‌ఎల్‌బీసీలోకి ఉత్తరాఖండ్‌ ఆపరేషన్‌ బృందం

SLBC ACCIDENT/ఎల్‌ఎల్‌బీసీలోకి ఉత్తరాఖండ్‌ ఆపరేషన్‌ బృందం
@#$SLBC ACCIDENT##

48 గంటలు దాటుతున్నా దొరకని 8మంది ఆచూకీ

వాయిస్ ఆఫ్ భారత్ , తెలంగాణ : నాగర్‌కర్నూల్‌లోని శ్రీశైలం ఎడమ గట్టు కాలవ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రయత్నాలు చేపట్టింది. ఘటన జరిగి 48 గంటలు దాటుతున్నా, లోపల చిక్కుకున్న వారిని చేరుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది, ఆర్మీ, నేవీ కమాండోలు, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంలో, 2023లో ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ప్రమాదంలో బాధితులను రక్షించిన ఆపరేషన్‌ బృందం సభ్యులను సహాయక చర్యలకు రంగంలోకి దించారు. ఆ ఆరు మంది సభ్యులు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 13 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలడంతో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. వీరిలో నలుగురు కార్మికులు కాగా, మిగతా వారు కన్‌స్ట్రక్షన్‌ సంస్థ సిబ్బందే. సహాయక బృందాలు ప్రస్తుతం 100 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, భారీగా నీరు చేరడం, ఇనుప రాడ్లు, ఇతర వ్యర్ధాలు కదలకుండా ఉండటం వల్ల లోపలికి వెళ్లే మార్గం సులభంగా లభించడం లేదు. రబ్బర్‌ ట్యూబులు, చెక్కల బల్లల సహాయంతో లోపల వారిని చేరుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టన్నెల్ గోడల్లో పగుళ్లు ఏర్పడి, నీరు అంతర్గతంగా ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. నీటిని తొలగించేందుకు అదనపు పరికరాలు అవసరమని అధికారులు తెలిపారు. ఇక టన్నెల్‌పై ఉన్న రాళ్లు కదులుతున్న శబ్దాలు వినిపిస్తుండటంతో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించి, సహాయ చర్యలకు ప్రభుత్వ మద్దతు అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. రాత్రంతా సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌ రెడ్డి, లోపల చిక్కుకున్న వారికి ఆక్సిజన్‌ అందించేందుకు, నీటిని తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. లోపల చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *