ROHITH SHARMA/కెప్టెన్ రోహిత్ శర్మపై భారీ అంచనాలు
యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి : 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా ఈ ఆదివారం జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ పై అందరి దృష్టి నిలిచింది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో తన ఫామ్‌ను తిరిగి పొందిన హిట్‌మ్యాన్, బంగ్లాదేశ్‌పై ఆకట్టుకునే ఆటతీరు ప్రదర్శించాడు. దీంతో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అతనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“రోహిత్ క్రీజులో స్థిరపడితే ఈజీగా సెంచరీ”
యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, “రోహిత్ శర్మ తన ఫామ్‌ను కొనసాగిస్తే, కేవలం 60 బంతుల్లోనే సెంచరీ బాదేయగలడు. అతడి ఆటతీరు అలా ఉంటుంది. క్రీజులో కుదురుకున్న తర్వాత ఫోర్లు, సిక్స్‌లతో పరుగుల వరద పారిస్తాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో అతను అత్యుత్తమం. 145-150 కి.మీ. వేగంతో వచ్చే బంతులను కూడా సులభంగా ఎదుర్కొంటాడు. హుక్ షాట్లను అద్భుతంగా ఆడి బౌండరీగా మలచగలడు. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించే సామర్థ్యం అతనికి ఉంది” అని వ్యాఖ్యానించారు. అలాగే, “రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీకి కూడా ఫామ్‌తో పెద్దగా సంబంధం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో, ముఖ్యంగా వన్డేల్లో, వారిద్దరూ మ్యాచ్ విన్నర్లు. రోహిత్ కొద్దిగా ఇబ్బంది పడుతూ కనిపించినా, క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు” అని యువీ అభిప్రాయపడ్డారు.
“రోహిత్, కోహ్లీ ఔటైతే ఒత్తిడి!”
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ, “ప్రస్తుత టీమ్ ఇండియాలో ప్రతీ ఆటగాడు అద్భుతమైన ప్రతిభ కలిగినవాడే. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జట్టు విజయాల్లో గత రెండు దశాబ్దాలుగా వారు కీలక భూమిక పోషిస్తున్నారు. ఒకవేళ వీరిద్దరూ త్వరగా ఔటైతే, టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆందోళన నెలకొంటుంది. అలాగే, పాకిస్థాన్ జట్టు పరంగా బాబర్ అజామ్ పెవిలియన్ చేరినా, మాకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యర్థి బౌలర్లు మరింత ఉత్సాహంతో బౌలింగ్ చేస్తారు. రోహిత్, కోహ్లీని వీలైనంత త్వరగా ఔట్ చేయగలిగితేనే పాకిస్థాన్‌కు ప్రయోజనం” అని అభిప్రాయపడ్డారు.

