RISING TELANGANA/తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు
వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ
వాయిస్ ఆఫ్ భారత్, తెలంగాణ : తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2025 నాటికి రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు సమకూరనున్నాయని, తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బయోటెక్ సహా పలు రంగాల్లో హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్ నూతన క్యాంపస్..
మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్ నూతన క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారిందని కొనియాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయని, ఉద్యోగ కల్పనలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. “తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తానని నేను చెప్పినప్పుడు కొంతమంది సందేహించారు. కానీ, రెండు దఫాలుగా దావోస్ పర్యటనల సందర్భంగా రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసిన తరువాత అందరూ విశ్వసిస్తున్నారు. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నంబర్ వన్‌గా హైదరాబాద్..
“మా పోటీ ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నైతో కాదు అని నేను చెప్పినప్పుడు కొందరు ఆశ్చర్యపడ్డారు. కానీ, ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్ వన్‌గా చేసి చూపించాం. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ రంగాల్లో తెలంగాణను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనిని అంగీకరిస్తోంది” అని సీఎం తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద లైఫ్ సైన్స్ కంపెనీలలో ఒకటైన ఆమ్జెన్ను ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభించినట్టు సీఎం గుర్తుచేశారు. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కలిగిన బయో ఆసియా సదస్సును విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. హెచ్‌సీఎల్ టెక్ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంస్థ దేశానికి గర్వకారణమని, ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో 2.2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు అందిస్తున్నట్టు తెలిపారు. డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, ఏఐ వంటి రంగాల్లో హెచ్‌సీఎల్ టెక్ అత్యుత్తమ సేవలు అందిస్తోందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

