Rekha Gupta/ఢిల్లీకి కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం
ప్రధాని మోదీ, పలువురు ప్రముఖుల హాజరు
27 ఏళ్ల తర్వాత అధికారంలోకి బీజేపీ
రామ్‌లీలా మైదానంలో ఘనంగా ప్రమాణ స్వీకారం
ప్రత్యేక ఆకర్షణగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బీజేపీలో పండుగ వాతావరణం
వాయిస్ ఆఫ్ భారత్, న్యూఢిల్లీ : ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రామ్‌లీలా మైదానంలో గురువారం జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. 27 సంవత్సరాల తర్వాత భాజపా దిల్లీలో అధికారంలోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. సినీ, పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా విచ్చేశారు.
హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు..
ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన రేఖా గుప్తా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, రామ్‌లీలా మైదానానికి చేరుకున్నారు. కార్యక్రమంలో సాధువులు, ప్రముఖులు పాల్గొనడంతో భద్రతను పటిష్ఠంగా నిర్వహించారు. 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. రేఖా గుప్తాతో పాటు భాజపా ఎమ్మెల్యేలు పర్వేశ్ వర్మ, ఆశీష్ సూద్, మజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు. రేఖా గుప్తాకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ కేటాయించారు.
రేఖా గుప్తా ప్రస్థానం..
1974, జులై 19న హరియాణాలోని జులానాలో జన్మించిన రేఖా గుప్తా, ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్ రామ్ కళాశాలలో బీకాం పూర్తిచేశారు. విద్యార్థి జీవితంలోనే ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1995-96లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా, 1996-97లో అధ్యక్షురాలిగా పనిచేశారు. మేరఠ్‌లోని చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి, కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1998లో మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు.
2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించిన రేఖా గుప్తా, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. ఆమె ఆరెస్సెస్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి, మహిళా సమస్యలపై చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న రేఖా గుప్తా, భాజపా తరఫున సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్‌ల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5వ మహిళగా నిలిచారు. విభిన్న పార్టీల నుంచి సీఎంగా పనిచేసిన 18వ మహిళగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.

