RAJA LINGA MURTHY MUREDER/రాజలింగమూర్తి హత్యపై సీబీసీఐడీ విచారణ
ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై సీబీసీఐడీతో విచారణ చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ కేసులో దోషులను 24 గంటల్లో పట్టుకుంటామని, ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని తెలిపారు. కేసు వెనుక గండ్ర వెంకట రమణా రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ, దీనికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మద్దతు ఉందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, ఇది తెలంగాణ సంస్కృతి కాదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు హత్యా రాజకీయాలను మానుకోవాలని హెచ్చరించారు.‘‘దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేసే స్థాయికి దిగజారారు. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’’అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజలింగమూర్తి మేడిగడ్డ అక్రమాలపై కోర్టులో పోరాడుతుండగా, నీళ్లు పోసుకుని పెట్రోల్ అని చెప్పి అమాయకులను మభ్యపెట్టిన హరీష్ రావు హత్యకు కారణమయ్యారని ఆరోపించారు. అడ్వకేట్ వామన రావును హత్య చేసిన వారికి కేసీఆర్ టికెట్ ఇచ్చారని విమర్శించారు. ‘‘హరీష్ రావు మానవత్వం ఉన్న వ్యక్తేనా?’’ అంటూ ప్రశ్నించారు. రాజలింగమూర్తి హత్యను డైవర్ట్ చేసేందుకు హరీష్ రావు కృష్ణా నీళ్ల గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘‘స్కాముల గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా? 15 నెలలుగా కేసీఆర్ ఎవరికి కనిపించారు? కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని కేసీఆర్కు ఎలా తెలుసు? భట్టి విక్రమార్క ఐదుగురు ఎమ్మెల్యేలతో ఒంటరిగా పోరాటం చేశారు’’అని వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. హత్యకు బాధ్యులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.
