MLC MALLANA SUSPEND/ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మల్లన్న పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాకుండా, బీసీ కులగణన ప్రతులను చించడంపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ కోరుతూ ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీస్ జారీ చేయగా, ఫిబ్రవరి 12వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని కోరినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు చిన్నారెడ్డి ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, పార్టీ లైన్‌ను దాటిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మల్లన్నను పలు మార్లు హెచ్చరించినా మార్పు రాలేదని, బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించిందని తెలిపారు. తీన్మార్ మల్లన్నపై వేటు వేయడం ద్వారా పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ఎవరికైనా ఇదే గుణపాఠం అవుతుందని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.
