Lady Doctor Death/విహారయాత్ర విషాదాంతం
తుంగభద్ర నదిలో ఈతకు దిగి లేడీ డాక్టర్ మృతి
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : హంపి ప్రాంతంలో విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన లేడీ డాక్టర్ అనన్యరావు మృతి చెందడం తీవ్ర విషాదానికి దారి తీసింది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన అనన్యరావు తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దిగారు. అయితే, కాసేపటికే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. దీన్ని గమనించిన స్నేహితులు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనన్యరావు నదిలో దూకుతున్న దృశ్యాలను స్నేహితులు వీడియో తీశారు. స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో వ్యతిరేక దిశలో అలలు రావడంతో ఆమె నీటిలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. స్నేహితులు వెంటనే స్థానిక పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మూడు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. అనన్యరావు ప్రముఖ డాక్టర్ కుమార్తె కాగా, ఆమె కూడా వైద్య విద్య పూర్తి చేశారు. తన స్నేహితులతో హంపి విహారయాత్రకు వెళ్లిన ఆమె ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద వార్త తెలుసుకున్న అనన్యరావు తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
