KRISHNA RIVER/కృష్ణా జలాల దోపిడీని అడ్డుకోండి
మొద్దు నిద్ర వీడకుంటే నష్టం
చేతకాకపోతే మేము చేస్తాం: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న జల దోపిడీని తక్షణమే అడ్డుకోవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. రేవంత్ సర్కారు నీటి దోపిడీని అడ్డుకోలేకపోతే, తమతో పాటు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలని హరీశ్ రావు సూచించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ :
“సాగు, తాగు నీటి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. సాగర్ కుడి కాల్వ నుంచి మూడు నెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కులు పోతున్నా పట్టించుకోలేదు. తాత్కాలిక వాటా కంటే ఎక్కువగా ఏపీ 657 టీఎంసీలను తరలించుకుపోయింది. 25 రోజుల్లోనే 65 టీఎంసీల నీటిని తరలించారు,” అని వివరించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. నాగార్జున సాగర్ కేంద్రం ఆధీనంలో ఉన్నప్పటికీ, ఏపీ అనుమతి లేకుండానే నీటిని తరలిస్తోందని ఆయన ఆరోపించారు. “కేంద్రాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ప్రతిపక్షాలను విమర్శించడమే తప్ప, నీటి తరలింపును ఆపడానికి ప్రభుత్వం స్పందించడంలేదు,” అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే..
“1015 టీఎంసీల నీరు కృష్ణా నదికి ఈ ఏడాది వచ్చింది. ఏపీకి కేవలం 9 టీఎంసీల హక్కు మాత్రమే ఉంది. ఇంకా 123 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉంది. తెలంగాణ ఇప్పటికే నష్టపోయింది,” అని పేర్కొన్నారు. యాసంగి పంట కోసం 6.5 లక్షల ఎకరాలకు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినప్పటికీ, సాగర్ ఎడమ కాల్వకు ఇంకా నాలుగు తడులు అవసరమని తెలిపారు. హైదరాబాద్ సహా జిల్లాలకు తాగునీటి అవసరం కూడా ఉన్నదని అన్నారు. “కృష్ణా బోర్డు కార్యాలయం ముందు, ఢిల్లీలో ధర్నా చేద్దాం. మేము కూడా వస్తాం. సాగర్ కుడి కాల్వ, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలింపును అడ్డుకోవాలి. నీటి తరలింపులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నందునే ఏపీ ఇష్టారీతిన నీటిని తరలించుకుంటోంది,” అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
