DIRECTOR RAJAMOULI/రాజమౌళిపై సంచలన ఆరోపణలు
వాయిస్ ఆఫ్ భారత్, సినిమా : టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. యు.శ్రీనివాస్ రావు అనే వ్యక్తి రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాయడంతో పాటు సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. ‘రాజమౌళి నా 34 ఏళ్ల స్నేహితుడు. అతడు ‘శాంతి నివాసం’ సీరియల్ చేసేందుకు ముందే మా స్నేహం ఉంది. ‘యమదొంగ’ సినిమాకు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పని చేశాను. కానీ రాజమౌళి జీవితంలో ఓ మహిళ ప్రవేశించడంతో, నన్ను పూర్తిగా దూరం పెట్టాడు. నేను ప్రేమించిన అమ్మాయిని అతని కోరిక మేరకు వదులుకున్నాను. రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ కావడమే నా త్యాగానికి కారణం’అని శ్రీనివాస్ ఆరోపించారు. అలాగే, ‘రాజమౌళి ఇండస్ట్రీలో నాకు అవకాశాలు రావకుండా చేశాడు. చివరకు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చేర్చాడు. పోలీసులు రాజమౌళి, రమా రాజమౌళిపై లై డిటెక్టర్ టెస్ట్ చేయించాలని కోరుతున్నాను’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అంతేకాదు, ‘‘రాజమౌళికి క్షుద్ర విద్యలపై నమ్మకముందని, అతడు ఇతర దర్శకులను తొలగించి తానే నెంబర్ వన్ అయ్యాడు’’ అని ఆరోపించారు. ఈ ఆరోపణలపై రాజమౌళి ఇంకా స్పందించలేదు. పోలీసుల విచారణ ఎలా కొనసాగుతుందో వేచిచూడాలి.
