CRIME RATE HIKE/రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, హింసలు
శాంతియుత తెలంగాణలో దాడుల పెరుగుదల : హరీశ్ రావు
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : గతంలో శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత హింస, నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్యనాయక్ తండాలో ఇటీవల బీఆర్‌ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్పు తెస్తారని చెప్పినప్పటికీ, ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను రెచ్చగొడుతూ వాస్తవంగా అల్లర్లు, హింసను ప్రేరేపిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్‌లో తమ స్వంత మార్క్ ఎమర్జెన్సీని అమలు చేస్తోందని అన్నారు. సాతాపూర్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడి జరిగిన మరుసటి రోజే నార్యనాయక్ తండాలో కాంగ్రెస్ అనుచరులు రెచ్చిపోయారని ఆయన ఆరోపించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొన్న హరీశ్ రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుల దాడులు రోజురోజుకూ పెరిగినా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, ప్రజా సమస్యలపై పోరాడేందుకు హక్కు ఉంటుందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడానికి అణచివేత విధానాన్ని అవలంబిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఉద్యమపార్టీ అని, గతంలో ఎన్నో అణచివేతలను ఎదుర్కొని నిలబడ్డామని, ఇప్పుడు కూడా ఎలాంటి దాడులు, కేసులు తమ కార్యకర్తలను భయపెట్టలేవని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలిచి పోరాడుతూనే ఉంటామని, పోలీసులు నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
