BHOGA PURAM AIRPORT/శరవేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు
71 శాతం పనులు పూర్తి కావచ్చాయి
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
వాయిస్ ఆఫ్ భారత్ , విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్ట్ త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకుని రావడమే తమ లక్ష్యమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు పనులు త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 71 శాతం పనులు అయ్యాయని తెలిపారు. మట్టి పనులు వందశాతం, రన్ వే 97శాతం, ట్యాక్సీ వే 92 శాతం,-టెర్మినల్ బిల్డింగ్ 60 శాతం, ఏటీసీ 72 శాతం, ఇతర బిల్డింగ్స్ 43 శాతం చేశామని చెప్పారు. ఎయిర్ పోర్ట్‌కు యాక్సిస్ రోడ్లు కూడా 37 శాతం పూర్తయ్యాయని చెప్పారు. తొమ్మిది నెలల్లో 29 శాతం నుంచి 71 శాతానికి తీసుకు వచ్చామన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయని.. అందులో భోగాపురం ఒకటి కావటం గర్వకారణమని చెప్పుకొచ్చారు. త్వరలో తాజ్ సంస్థ హోటల్ నిర్మాణం చేయనుందని తెలిపారు. 3.8 కిలో మీటర్ల మేర పెద్ద రన్ వే నిర్మాణం భోగాపురంలో జరుగుతోందన్నారు. ఎయిర్ పోర్ట్ పనులు సంతృప్తిగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై ఇటీవల ఎగిరిన విమానాలు తమ శాఖకకు చెందినవి కాదని.. ఆ విమానాలు రక్షణ శాఖకు చెందినవన్నారు. వారితో సంప్రదించి మరోసారి అలా జరగకుండా చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.కాగా, భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు అని నామకరణం చేశారు. జీఎమ్మార్ సంస్థ మొదటి విడత కింద రూ.4,650 కోట్లతో భోగాపురం విమానాశ్రయ పనులు చేపట్టింది. 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆ సంస్థ ప్రకటించినప్పటికీ జనవరి నాటికే పూర్తి చేయించాలనన దృఢ నిశ్చయంతో ఉంది ప్రభుత్వం. మొత్తం 2203 ఎకరాల్లో భోగాపురం పనులు చేపట్టాగా.. అదనంగా మరో 500 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని జీఎంఆర్ కోరగా అందుకు సర్కార్ అంగీకారం తెలిపింది. భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతంగా నిలువనుంది. అలాగే విమానాశ్రయం రహదారి కోసం భోగాపురం మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో 60.8 ఎకరాలను సేకరించారు. ఎన్‌హెచ్ 16 నుంచి విమానాశ్రయం వరకు అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు.

