ATTACK ON PUBLIC VICES/ప్రజాపాలన అంటే ప్రజా గొంతుకలపై దాడులా?
బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులు హేయం: కేటీఆర్
వాయిస్ ఆఫ్ భారత్, తెలంగాణ : ప్రజాపాలనలో పాలకుల నిర్లక్ష్యంపై గొంతెత్తిన వారిపై దాడులు చేయడమేనా? అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్యనాయక్ తండాలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై జరిగిన కాంగ్రెస్ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సమీపంగా సాతాపూర్‌లో జరిగిన దాడి మరువక ముందే మరోసారి బీఆర్‌ఎస్ శ్రేణులపై దాడి చేయడం కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు వరుస దాడులకు పాల్పడుతున్నా, పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం గమనార్హమని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ప్రజల కష్టాలను వెల్లడించే వారి గొంతు నొక్కి, విచక్షణారహితంగా దాడులు చేయడమేనా? అంటూ ప్రశ్నించిన కేటీఆర్, కొల్లాపూర్ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం నాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు. గత పదేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్‌లో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ తరహా దాడులు పెరిగిపోయాయని తెలిపారు. మంత్రి జూపల్లి అండదండలతోనే ఈ అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అయితే, ఇలాంటి దాడులకు బీఆర్‌ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలిచి అసమర్థ ప్రభుత్వాన్ని నిలదీయడం కొనసాగిస్తామని, దాడులకు పాల్పడిన నిందితులపై పోలీసు శాఖ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.
