AMBERPET FLYOVER/అంబర్‌పేట ఫ్లైఓవర్ ఎట్టకేలకు అందుబాటులోకి
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు మహా శివరాత్రి కానుకగా అంబర్‌పేట ఫ్లైఓవర్ ఎట్టకేలకు అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఫ్లైఓవర్‌ను పరిశీలించి బుధవారం నుంచి రాకపోకలకు అనుమతినిస్తున్నట్లు ప్రకటించారు. గోల్నాక నుంచి అంబర్‌పేట ఇరానీ హోటల్ వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ స్థానికులకు ట్రాఫిక్ సమస్యను తగ్గించనుంది. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎన్టీఆర్ హయాంలో రహదారి విస్తరణకు ప్రయత్నించినప్పటికీ, శ్మశాన వాటికల కారణంగా విస్తరణ సాధ్యపడలేదని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి తాను ప్రత్యేకంగా చొరవ చూపి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు ఇప్పించానని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల నుండి ఉపశమనం కల్పించేలా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి రూ.338 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఫ్లైఓవర్ కింద ఉన్న భూములను భూసేకరణ చేసి రహదారి విస్తరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
