ADUDHAM ANDHRA SCAM/ఆడుదాం ఆంధ్రాలో నిధుల గోల్‌మాల్‌..

ADUDHAM ANDHRA SCAM/ఆడుదాం ఆంధ్రాలో నిధుల గోల్‌మాల్‌..
$$$adhudham andhra scam$$

అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ
పేద క్రీడాకారులతో ఆడుకున్న గత ప్రభుత్వం
అసెంబ్లీలో మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి వెల్లడి

వాయిస్ ఆఫ్ భారత్, ఆంధ్రప్రదేశ్ : ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని రాష్ట్ర క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, పేద క్రీడాకారుల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుందని విమర్శించారు. ఈ అంశంపై మాట్లాడటమే తనకు సిగ్గుగా ఉందని పేర్కొన్నారు. అవినీతి నిర్ధారణ కోసం 45 రోజుల్లోనే విజిలెన్స్‌ కమిటీ, హౌస్‌ కమిటీ విచారణకు ఆదేశాలు ఇచ్చామని, దోషుల పేర్లు త్వరలో వెల్లడిస్తామని హెచ్చరించారు. గత జగన్‌ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ కోసం రూ. 119.19 కోట్లు కేటాయించగా, రూ. 119.11 కోట్లు ఖర్చు చేశారని మంత్రి వివరించారు. ఈ నిధులను ఆర్‌ అండ్‌ బీ, క్రీడాశాఖ, జిల్లా కలెక్టర్ల ద్వారా ఖర్చు చేశారని వెల్లడించారు. స్పోర్ట్స్‌ కిట్‌ల కోసం రూ. 38.55 కోట్లు, టీషర్ట్లు, క్యాప్‌ల కోసం రూ. 34.2 కోట్లు, జిల్లా కలెక్టర్ల స్పోర్ట్స్‌ అకౌంట్స్‌కు రూ. 40.93 కోట్లు డిపాజిట్‌ చేశారని, ఇందులో రూ. 21 కోట్లు ఆఫ్‌ సైటింగ్‌ చార్జీల కోసం వెచ్చించారని వివరించారు. ప్రైజ్‌ మనీ కోసం రూ. 12.21 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.

అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ, ‘ఆడుదాం ఆంధ్రా’ స్కాంపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. మాజీ మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ, జగన్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తోనే ఆడుకుందని విమర్శించారు. అప్పటి మంత్రి ఆర్కే రోజా ఫుట్‌బాల్, వాలీబాల్‌ మధ్య తేడా తెలియకుండా రూ. 120 కోట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆరోపించారు. క్రీడాకారులను ఫోకస్‌ చేయకుండా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.

అఖిల ప్రియ ఆరోపణల ప్రకారం, వలంటీర్ల ద్వారా ఫేక్‌ ఆధార్‌ కార్డులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేశారని, స్టిక్కర్లు, హోర్డింగ్‌లు, సోషల్‌ మీడియా ప్రచారానికి రూ. 35 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. గెలిచిన క్రీడాకారులకు రూ. 12 కోట్లు అకౌంట్లలో వేయలేదని, విశాఖపట్నంలో ముగింపు కార్యక్రమానికి రూ. 5 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, సంబంధిత అధికారులు స్కాం వివరాలు డిలీట్‌ చేశారని పేర్కొన్నారు.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, ఈ కార్యక్రమం పేరుతో యువతను మోసం చేశారని అన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లతో విజేతలను ప్రకటించారని, నాణ్యతలేని క్రీడా సామాగ్రి సరఫరా చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ముగింపు కార్యక్రమాలకు వీఐపీల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు.

రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, జగన్‌, రోజా, శాప్‌ మాజీ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థ రెడ్డిలకు ఈ స్కాంలో ప్రమేయముందని ఆరోపించారు. 120 మంది బ్రాండ్‌ అంబాసిడర్‌లను నియమించారని, వారి అర్హతలు ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు యువతను ప్రలోభ పెట్టేలా ఈ కార్యక్రమం నిర్వహించారని, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *