అలరించిన ‘చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే’

అలరించిన ‘చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే’

చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసేలా వేడుకలు
మురిసిపోయిన తల్లిదండ్రులు
నిర్మల హై స్కూల్‌లో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల స్నాతకోత్సవం

వాయిస్ ఆఫ్ వందే భారత్, వేములవాడ : స్థానిక నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో శనివారం ప్రీ-ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్నారి విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో తొలి మెట్టును అధిగమించి ప్రాథమిక విద్యలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని అత్యంత ఆహ్లాదకరంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో చిన్నారులు తమలోని సృజనాత్మకతను, ప్రతిభను చాటుతూ ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పాఠశాల ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెవరెండ్ సిస్టర్ క్యాస్పర్ గారు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుండే ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. చదువుతో పాటు చక్కని క్రమశిక్షణను అలవరుచుకున్నప్పుడే సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని ఆమె ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ అరసి విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం పాఠశాల అందిస్తున్న తోడ్పాటును వివరించారు. తమ పిల్లల కోసం ఇంత చక్కటి వేదికను కల్పించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *