డయాబెటిస్ బాధితులకు ‘పీఏడి’ ముప్పు
అప్రమత్తంగా లేకుంటే కాలు కోల్పోయే ప్రమాదం
యశోద హాస్పిటల్స్ వైద్యులు డా.శ్రీకాంత్ రాజు
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : మధుమేహం (డయాబెటిస్) ఉన్న రోగుల్లో కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం (పీఏడి – Peripheral Arterial Disease) అనే సమస్య పట్ల అవగాహన అత్యవసరమని ప్రముఖ సీనియర్ వాస్క్యులర్, ఎండోవాస్కులర్ సర్జన్ మరియు యశోద హాస్పిటల్స్ (హైటెక్ సిటీ) క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు హెచ్చరించారు. ఆదివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాబెటిస్ బాధితుల్లో పీఏడి సమస్య వేగంగా విస్తరిస్తోందని డాక్టర్ శ్రీకాంత్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. “డయాబెటిస్ ఉన్నవారిలో రక్తనాళాలు పూడుకుపోవడం వల్ల కాళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారి, చివరకు గ్యాంగ్రీన్ (కుళ్ళిపోవడం) కు దారితీస్తాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే కాలును తొలగించాల్సిన (Amputation) పరిస్థితి ఏర్పడుతుంది,” అని ఆయన వివరించారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి రావడం లేదా త్వరగా అలసిపోవడం.పాదాలు ఎప్పుడూ చల్లగా ఉండటం. పాదాలపై గాయాలు త్వరగా మానకపోవడం. కాలి వేళ్లు రంగు మారి నల్లబడటం.
డయాబెటిక్ న్యూరోపతి (నరాల జబ్బు) ఉన్నవారికి నొప్పి తెలియకపోవచ్చు, కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.
ముందస్తు పరీక్షలే రక్షణ
సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే అత్యాధునిక చికిత్సలతో కాలును కాపాడవచ్చని డాక్టర్ తెలిపారు.
పరీక్షలు: కాళ్ల రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ ద్వారా రక్తప్రసరణ స్థితిని తెలుసుకోవచ్చు.
చికిత్స: మందులతో పాటు అవసరమైతే యాంజియోప్లాస్టీ వంటి అధునాతన పద్ధతుల ద్వారా రక్తనాళాల అడ్డంకులను తొలగించవచ్చు.
వైద్యుల సూచనలు:
రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోవాలి. ప్రతిరోజూ పాదాలను స్వయంగా పరిశీలించుకోవాలి. చిన్న గాయం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాస్క్యులర్ సర్జన్‌ను సంప్రదించాలి.
అవగాహన మరియు సకాలంలో స్పందన ఉంటే డయాబెటిస్ రోగులు తమ పాదాలను సురక్షితంగా కాపాడుకోవచ్చని డాక్టర్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు.
