కదం తొక్కిన పద్శశాలీలు/Konda laxman bapuji
ఏకశిలా పార్కు నుంచి బైకు ర్యాలీ
అధికారికంగా జయంతి వేడుకలు
బాపూజీ చిత్రపటానికి ఘన నివాళులు
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : జాతి పితా, గొప్ప సంఘ సేవకులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు సమాజానికి ఆదర్శమని, ఆయన కృషి చిరస్మరణీయమని ఎంపీ కడియం కావ్య కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతిని పురస్కరించుకుని పద్మశాలి పరపతి సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలో జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.

బైకు ర్యాలీతో హోరెత్తిన వీధులు..
పద్మశాలి పరపతి సంఘాల కన్వీనర్ వైద్యం రాజగోపాల్ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హనుమకొండలోని ఏకశిలా పార్కు నుంచి ప్రారంభమైన బైకు ర్యాలీ ఫారెస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు ఉత్సాహంగా కొనసాగింది. వందలాదిగా తరలివచ్చిన పద్మశాలి కులస్తులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా “జై మార్కండేయ, జై పద్మశాలి” నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన కులస్తులతో ప్రధాన రహదారులు పసుపు మయం అయ్యాయి.
బాపూజీ సేవలు నేటి తరానికి ఆదర్శం: ఎమ్మెల్యే నాయిని
ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సైతం బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపూజీ జీవితం మరియు జాతికి ఆయన అందించిన నిస్వార్థ సేవలను కొనియాడారు. “కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక తరానికి మాత్రమే కాదు, నేటి సమాజానికి కూడా ఆయన సేవలు ఆదర్శనీయం” అని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బాపూజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ స్నేహ శబరీష్ హామీ
అనంతరం, కలెక్టరేట్‌లో అధికారికంగా ఏర్పాటుచేసిన జయంతి వేడుకల్లో పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వచ్చే జయంతిలోపు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను హనుమకొండలో ఏర్పాటు చేయాలని పద్మశాలి కులస్తులు కలెక్టర్ స్నేహ శబరీస్ కు విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్, బాపూజీ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల రమేష్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ పూర్వ ఉపాధ్యక్షులు ఈగ మల్లేశం, ఇతర నాయకులు మరియు పద్మశాలి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

