‘మేడారం అభివృద్ధి నా బాధ్యత’/’The development of Medaram is my responsibility’
ఆదివాసీల కుంభమేళాకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వాయిస్ ఆఫ్ భారత్, ములుగు : మేడారం మహాజాతర పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి తమ ప్రభుత్వానికి కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదని, అది భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు. మేడారం గద్దెల అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
గతంలో పాలకులు మేడారం ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని, తాను సమ్మక్క సారలమ్మల ఆశీస్సులతోనే ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డపై నుంచి పాదయాత్ర మొదలుపెట్టానని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణకు పట్టిన ‘చీడ, పీడను’ వదిలించేందుకే ఆనాడు అడుగులు వేశామని తెలిపారు.
ఆదివాసీల సంక్షేమం ..
ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని, వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలలో ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి, ఆలయ ప్రాంగణం పునర్నిర్మాణంతో తనకు, మంత్రి సీతక్కకు ఈ జన్మ ధన్యమైనట్లేనని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
రాతి కట్టడాల నిర్మాణం..
చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే రాతి కట్టడాలనే మేడారం అభివృద్ధిలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహాజాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు పగలు, రాత్రి నిర్విరామంగా కొనసాగాలని, దీనికి స్థానికుల భాగస్వామ్యం, సహకారం తప్పనిసరి అని అన్నారు. సమ్మక్క సారలమ్మ మాలధారణ చేసినట్లుగా భక్తితో పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు. కుంభమేళాకు వేల కోట్లు ఇస్తున్న కేంద్రం, ఆదివాసీ కుంభమేళా అయిన మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
మేడారం మహాజాతరకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వచ్చే జాతర నాటికి మళ్లీ వస్తానని, ఈసారి జాతరను గొప్పగా జరుపుకుందామని ప్రజలకు హామీ ఇచ్చారు.
