దేవుడి భూములపై లీగల్ పోరాటం గట్టిగా చేయండి/Fight the legal battle over Enodoment lands vigorously.
న్యాయ పోరాటం సరైన రీతిలో జరగడం లేదు
ఎండోమెంటు గవర్నమెంటు ప్లీడర్ల సమావేశంలో మంత్రి సురేఖ
ప్రతి ఆరు నెలలకొక సారి మీటింగ్ పెట్టి స్టేటస్ చెప్పాలి
ఎండోమెంటు భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టాలి
మంత్రి కొండా సురేఖ
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్: దేవుడి భూముల పరిరక్షణ విషయంలో లీగల్ పోరాటం మరింత పటిష్టంగా ఉండాలని, ఈ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడం లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో ఎండోమెంట్ గవర్నమెంట్ ప్లీడర్ల (జీపీల)తో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దేవుడి భూముల అన్యాక్రాంతానికి సంబంధించి కేసుల పురోగతిని ఆమె సమీక్షించారు. లీగల్ టీమ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవాలయ భూములను కాపాడటంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. కోర్టులో వాదించేటప్పుడు ఎందుకు పటిష్టంగా ఉండటం లేదని నిలదీశారు.
కేసుల పురోగతిపై ప్రశ్న..
తాను దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటికీ ఎన్ని కేసులు గెలిచామో తెలియడం లేదని మంత్రి అన్నారు. అసలు కేసుల అప్‌డేట్ గురించి అడిగితే ఎవరూ చెప్పలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా, 2002 నుంచి 2025 వరకు 1,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 543 కోర్టు కేసులను పరిష్కరించామని జీపీలు తెలిపారు. దేవుడి భూములను కాపాడటంలో లీగల్ టీమ్ పాత్ర చాలా కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశం పెట్టి కేసుల స్థితిగతులను వివరించాలని అధికారులను ఆదేశించారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ట్రస్టీలకు సంబంధించిన కేసుల్లో గట్టిగా వాదించాలని చెప్పారు. పురావస్తు శాఖ నుంచి వివరాలు సేకరించి, వాటిని సాక్ష్యాలుగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక నిపుణుల కమిటీని నియమించాలని అన్నారు. అలాగే, కంటెంట్ ఆఫ్ కోర్టు (న్యాయస్థాన ధిక్కారం) అంశాలపై కూడా జాగ్రత్తగా ఉండాలని, కోర్టు పిలిచే వరకు పరిస్థితిని తీసుకెళ్లవద్దని సూచించారు. భూములకు సంబంధించిన అంశాలు, దేవాలయ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలను కూడా పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. సివిల్ సప్లైస్ శాఖ మాదిరిగానే ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులకు ఎండోమెంట్ చట్టంపై ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలని, ప్రతి జిల్లాకు ఒక లీగల్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, యాదగిరిగుట్ట ఈవో వెంకటరావు, కమిషనర్లు కృష్ణప్రసాద్, కృష్ణవేణి, ఎండోమెంట్ జీపీ బీఎం నాయక్, ఏజీపీ శైలజ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

