‘హలో బీసీ.. చలో కామారెడ్డి’/‘Hello BC.. Chalo Kamareddy’
మంత్రి కొండా సురేఖ పిలుపు
15న బీసీ బహిరంగ సభకు తరలిరావాలి
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ (సెప్టెంబర్ 11): సెప్టెంబర్ 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని వివరించడానికి, బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను ప్రజలకు తెలియజేయడానికి రాష్ట్రంలోని బీసీలందరూ లక్షలాదిగా తరలిరావాలని ఆమె కోరారు. గురువారం హైదరాబాద్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో కామారెడ్డి సభ ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తదితరులతో కలిసి కొండా సురేఖ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించామని, ఇచ్చిన హామీ మేరకు బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ అడ్డుకుంటున్నాయని మంత్రులంతా ఆరోపించారు. కామారెడ్డి వేదికగా ఇచ్చిన బీసీ కులగణన హామీని ఇప్పటికే సాధించామని వారు వివరించారు. సెప్టెంబర్ 15న నిర్వహించే బహిరంగ సభ ప్రతిష్టాత్మకమని, దానిని విజయవంతం చేయడానికి అవలంబించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి సురేఖ తెలిపారు.

