మేడారం జాతర పనులు వేగవంతం చేయాలి
పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టండి
ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్
వాయిస్ ఆఫ్ భారత్, ములుగు : మేడారం జాతర పనులను భక్తులు సంతృప్తిగా అమ్మవార్లను దర్శించుకునేలా వేగవంతం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు సంయుక్త తనిఖీ నిర్వహించి, వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గురువారం తాడ్వాయి మండలంలోని మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సీ.హెచ్.మహేందర్ జి, సంపత్ రావుతో కలిసి సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పీఆర్, ఆర్&బి, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్.డబ్ల్యూ.ఎస్, రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్త తనిఖీ నిర్వహించి, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రతి శాఖకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, పనులు క్షేత్ర స్థాయిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన మహా జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మేడారం పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విధులు కేటాయించబడిన ఏఈ, డీఈలు మేడారంలోనే ఉండి పనులు చేపట్టాలని, ఈఈలు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం క్షేత్ర సందర్శన చేసి, పురోగతిని పర్యవేక్షించాలన్నారు. ఈసారి సుమారు కోటిన్నర మంది భక్తులు జాతరకు రానున్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇది వన దేవతల పండుగ కాబట్టి, వనాన్ని, వనంలోని ప్రాణులను కాపాడుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, డీఆర్డీఓ శ్రీనివాస్ రావు, ఈవో వీరస్వామి, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.

