ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తి
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
వాయిస్ ఆఫ్ భారత్, పాలకుర్తి (సెప్టెంబర్ 10): రైతు హక్కుల కోసం, అణగారిన వర్గాల గౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పాలకుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి పాల్గొని, రాజీవ్ చౌరస్తాలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐలమ్మ పోరాటం నేటికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఆనాడు సమాజంలో ఉన్న అన్యాయాలను ఆమె ధైర్యంగా ఎదుర్కొని, భూస్వాముల అణచివేతకు ప్రతిఘటించి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బ్లాక్, మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, ఇతర పార్టీ శ్రేణులు, అలాగే ఐలమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజీవ్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ఐలమ్మ త్యాగాలను స్మరించుకున్నారు.
