జె.తొర్రూరు చెరువులో నాలుగేళ్ల తర్వాత నీళ్లు/Water in J. Thorrur pond after four years
వాయిస్ ఆఫ్ భారత్, పాలకుర్తి: పాలకుర్తి మండలంలోని జె.తొర్రూరు గ్రామంలో గత నాలుగు సంవత్సరాలుగా నీరు నిల్వ లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్న చెరువు, ప్రస్తుతం నీటితో నిండి పునరుజ్జీవం పొందింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువు మత్తడి బలహీనపడి నీరు నిల్వ ఉండకపోవడంతో గ్రామస్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చొరవతో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఓ అండ్ ఎం నిధుల కింద రూ. 17 లక్షలతో మత్తడి మరమ్మతు పనులు పూర్తి అయ్యాయి. ఈ పనుల ఫలితంగా 4ఎల్ కెనాల్ నుండి నల్లకుంట మీదుగా వచ్చిన నీరు జె.తొర్రూరు చెరువులోకి చేరింది. నాలుగు సంవత్సరాల తర్వాత చెరువులో నీరు నిల్వ ఉండటం ఇదే మొదటిసారి.
రైతుల ఆనందం..
చెరువులో నీరు నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నీటితో వ్యవసాయానికి, పశువులకు తాగునీరు లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెరువును సందర్శించి, మత్తడి మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చెరువులు బలపడితేనే గ్రామాల వ్యవసాయం, పశుపోషణలు చక్కగా సాగుతాయని అన్నారు. చెరువుల పునరుద్ధరణకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలు కూడా వాటి సంరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లవుడ్యా మంజుల భాస్కర్, బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, శ్రీనివాస్, యకాంతరావు, భాస్కర్, మాదర్, అనుములా మల్లారెడ్డి, మైసయ్య, ఇతర మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
