నియోజకవర్గ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
రూ. 1.50 కోట్ల బీటీ రోడ్డుకు శంకుస్థాపన
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్‌లోని రెడ్డిపురం గ్రామంలో రూ. 1.50 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు విజయలక్ష్మి కాలనీ నుంచి సాయి కృప కాలనీ మీదుగా ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ వరకు నిర్మిస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే నాగరాజుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, “ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రెడ్డిపురం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు, డ్రైనేజీ సమస్యకు ఈ ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం అవుతుంది,” అని అన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని తీసుకురావడానికి ప్రజల సహకారం అవసరమని పిలుపునిచ్చారు. “అభివృద్ధి కేవలం మాటలకే పరిమితం కాకుండా, కార్యరూపంలో కనిపించాలి. అందుకే ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్నాం,” అని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి సాధించడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లావుడ్య రవి నాయక్, మాజీ కార్పొరేటర్ బానోతు కల్పన సింగిలాల్, ఎనుమాముల ఏఎంసీ డైరెక్టర్ రైతు రాజు, హనుమకొండ మండల అధ్యక్షుడు మాదాసి అజయ్, డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుట్ట తిరుపతి, జవహర్ నాయక్, అలాగే రెడ్డిపురం విజయలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

