దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి/ Dalit Christians rally

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి/ Dalit Christians rally
@@@Dalit Christians rally@@

రాష్ట్రపతి ఉత్తర్వుపై శాంతి ర్యాలీ
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో క్యాథలిక్స్, ప్రొటెస్టంట్‌ సంఘాల ఆధ్వర్యంలో గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు. 1950 ఆగస్టు 10న జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను (ఎస్సీ) రద్దు చేయాలని వారు నినదించారు. ఈ ర్యాలీలో డయాసిస్ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ డి.విజయపాల్, వరంగల్ డయాసిస్ ఎస్సీ, బీసీ కమిషన్ కార్యదర్శి ఫాదర్ మాచర్ల నవీన్, యెరూషలేము బాప్టిస్ట్ చర్చి బిషప్ ఐజాక్, బిషప్ జాన్ మార్కండేయ తదితరులు ప్రసంగించారు. వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే క్రైస్తవ సంఘాలు నిస్వార్థంగా వైద్య, విద్య, సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళిత క్రైస్తవుల సామాజిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదని, వారు ఇంకా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారడం వల్ల వారి సామాజిక స్థాయి మారలేదని కాకా కలేల్కర్ కమిషన్ (1955), ఎలయపెరుమాల్ కమిషన్ (1969), మండల్ కమిషన్ (1980), మైనారిటీ కమిషన్ (1980), రంగనాథ్ మిశ్రా కమిషన్ (2007) వంటి అనేక కమిషన్లు ధృవీకరించాయని గుర్తు చేశారు. దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక స్థాయి ఒకటేనని, కానీ హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు స్వీకరించిన దళితులకు రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని హక్కులు, భద్రత కల్పించబడ్డాయని తెలిపారు. సిక్కులకు 1956లో, బౌద్ధులకు 1990లో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారని పేర్కొన్నారు. అయితే, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు మాత్రం రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్‌లు, ఎస్సీ/ఎస్టీ చట్టం వంటి హక్కులను కోల్పోయారని ఆరోపించారు. అందువల్ల, రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులను, దళిత ముస్లింలను కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి దళిత క్రైస్తవులు, మేధావులు, సమాజంలోని అన్ని వర్గాలవారు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎస్సీ, బీసీ కమిషన్ సభ్యులు బొక్కా దయాసాగర్, లాదెళ్ల జాన్సన్, కలపాల ప్రవీణ్, కొట్టే అశోక్, మాజీ కార్పొరేటర్లు ఫ్రాంక్లిన్ సుధాకర్, బోడ డిన్నా, పాస్టర్లు జోసెఫ్ ప్రభాకర్, అశోక్ పాల్, యు.డేవిడ్, నల్లా డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *